కడప ఉక్కు ఏమైంది ?

Update: 2023-06-22 20:00 GMT
నాలుగు నెలల క్రితం ఎంతో ఆర్భాటంగా చేసిన కడప ఉక్కు పరిశ్రమ భూమి పూజ తర్వాత ఏమైంది ? ఏమీకాలేదు ఎందుకంటే పరిశ్రమ పనుల్లో పెద్దగా పురోగతి కనబడటం లేదు. నాలుగు నెలల క్రితం భూమిపూజ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 24 నెలల్లోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటుచేసి మొదటి విడత ఉత్పత్తి కూడా మొదలుపెడతామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటు కావాలంటే ముందుగా మౌళిక సదుపాయాల ఏర్పాటుజరగాలి.

ఆ విధంగా చూసుకుంటే మౌళిక సదుపాయాలను చూసుకుంటే రోడ్డు ఏర్పాటు మాత్రమే జరుగుతోంది. మిగిలిన నీటి సౌకర్యం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు, డ్రైనేజీ ఏర్పాటు జరగటంలేదు. దాంతో పరిశ్రమ మొదటిదశ నిర్మాణం ఎలా సాధ్యమనే సందేహాలు పెరిగిపోతున్నాయి. 24 నెలల్లో మొదలవ్వాల్సిన మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం 20 నెలల్లోనే ఎలా సాధ్యమనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మొదటిదశ నిర్మాణ పనులను రు. 3500 కోట్లతో ఏడాదికి 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలుపెడతామని చెప్పారు.

రెండో దశలో మరో రు. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు జగన్ చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీని ఎంతో పేరున్న జిందాల్ స్టీల్స్ కు ఇవ్వటం వల్ల నిర్మాణం, ఉత్పత్తి పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతాయనే అందరు అనుకున్నారు. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు, పనులు చూస్తుంటే జగన్ ప్రకటన సాకారమవుతుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మౌళిక సదుపాయాల కల్పనకు రు. 700 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు కూడా అప్పట్లో ప్రకటించారు.

ముందు మౌళిక సదుపాయాల ఏర్పాటు జరిగితే కానీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం పనులు మొదలుకావని అందరికీ తెలిసిందే. ఒకవైపేమో షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపేమో ఫ్యాక్టరీ నిర్మాణం అనుకున్నట్లుగా జరిగేట్లు కనబడటంలేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మౌళిక సదుపాయాల ఏర్పాట్లు జోరందుకుంటాయేమో చూడాలి. సరే ఏదో కారణంగా మౌళికసదుపాయాల ఏర్పాటు జరిగితే వెంటనే పరిశ్రమ నిర్మాణపనులు జోరందుకుంటాయేమో చూడాలి.

Similar News