లేటెస్ట్ గా.. జగన్ బ్యాచ్ మరో వికెట్ డౌన్

Update: 2016-03-04 06:06 GMT
జగన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఆపరేషన్ కు స్పందన రోజురోజుకీ పెరుగుతోంది. సైకిల్ ఎక్కేందుకు ఏపీ విపక్ష నేతలు మా జోరు మీదున్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. గత కొద్ది రోజులుగా ఏపీ అధికారపార్టీలోకి చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే అధికారపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి విజయవాడకు వచ్చిన వెంకట రమణ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పిన చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

వెంకటరమణ చేరిక కొత్తేం కాదు. ఆయన ఇప్పటికే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన ముందస్తుగా చెప్పిన మాట ప్రకారమే.. ఆయన సైకిల్ ఎక్కేశారు. తాజా చేరికతో విపక్షం నుంచి అధికారపక్షానికి చేరుకున్న నేతల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
Tags:    

Similar News