కమలాపురం కౌన్సిలర్ నీలం ప్రమీల రాజీనామా రాష్ట్ర వార్త? ఎందుకలా?

Update: 2023-04-12 14:40 GMT
కడప జిల్లాలోని కమలాపురం పురపాలక సంఘంలోని ఒక కౌన్సిలర్ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకునే అంశంగా ఎందుకు మారింది. వైసీపీ కౌన్సిలర్ గా గెలుపొందిన ఆమె.. తాను రాజీనామా చేయకున్నా.. రాజీనామా చేసినట్లుగా పురపాలక సంఘం సమావేశంలో ఎజెండాగా ఎందుకు మారింది? ఆమె మీదా.. ఆమె భర్త మీదా కేసుల పరంపర ఏమిటి? ఒక మహిళా కౌన్సిలర్ గురించి అందరూ మాట్లాడుకునే వరకు విషయం ఎందుకు వెళ్లింది? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

ఏపీలో ఉన్న మున్సిపాలిటీల్లో కడప జిల్లాలోని కమలాపురం మున్సిపాలిటీ ఒకటి. ఈ మధ్య వరకు దాని ఉనికి బయట వారికిపెద్దగా తెలిసింది లేదు. ఎప్పుడైతే మున్సిపాలిటీకి చెందిన 20వ వార్డు కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న నీలం ప్రమీల.. తాను గెలిచిన వైసీపీ నుంచి టీడీపీలోకి మారారో.. అప్పటి నుంచి  ఆమె పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తన భర్త మీద రెండు తప్పుడు కేసులు నమోదు అయ్యాయని.. ఒక కేసులో మూడు రోజులు జైలుకు కూడా వెళ్లి వచ్చారని ఆమె వాపోతున్నారు. ఒక హత్య కేసులో తన భర్తను ఇరికించాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆమె తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారన్న వార్త రాగా.. తప్పుడు పత్రాలతో తనను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాదు.. తనను ఎన్నికల్లో గెలిపించినందుకు రూ.25 లక్షలు ఖర్చుఅయ్యాయని.. ఆ మొత్తాన్ని తాము కట్టాలంటూ వైసీపీకి చెందిన వారు దౌర్జన్యానికి దిగుతున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ఫోర్జరీ సంతకంతో ఉన్న రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా తీసుకున్న నిర్ణయంపై ఆమె ఇప్పుడు బయటకు వచ్చారు.

తాను తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పురపాలక సంఘం అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. గత నెల 18న ఆమె.. ఆమె భర్త వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అప్పటి నుంచి తమకు వేధింపులు మొదలైనట్లుగా చెబుతున్నారు. వైసీపీ నేతలు పలువురు తమ ఇంటికి వచ్చి.. ఎన్నికల్లో గెలిపించేందుకు అయిన ఖర్చును తమకు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తన భర్త మీదా వైసీపీ నేతలు.. అధికారులతో కలిసి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె చెబుతున్నారు. మహిళా శిశుసంక్షేమ సంఘం ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న మేరీ.. తన ట్రాక్టర్ డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎస్ఐను కలవగా.. తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారని.. ఎందుకు సంతకం అడుగుతున్నారంటే.. డ్రైవర్ జామీను కోసమని చెబితే తాను సంతకం చేశానని.. తీరా చూస్తే.. నీల ప్రమీల భర్త.. నీల నరేంద్ర తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేసిన అరెస్టు చేయటాన్ని సదరు అధికారి మేరీ మండిపడుతున్నారు.

తాను నీల నరేంద్ర మీద ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. ఆయన్ను ఎలా అరెస్టు చేస్తారంటూ ఎస్ఐను ప్రశ్నించిన వైనం షాకింగ్ గా మారింది. అక్కడితో ఆగని ఆమె.. జిల్లా ఎస్పీని కలిసిన మేరీ.. నరేంద్రపై తాను ఎలాంటి కంప్లైంట్ చేయలేదని.. కానీ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయటాన్ని ప్రశ్నించటంతో.. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

ఇలా.. తాము చేయని తప్పులకు ఏదోరకంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదంతా కూడా పార్టీ మారినందుకే తనను ఇంతలా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి పార్టీ మారిన ఒక మహిళా కౌన్సిలర్ కు ఇన్నేసి షాకులు తగులుతాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Similar News