రెడ్లు, క‌మ్మ‌లు.. ఇంక తూర్పు తిరిగి ద‌ణ్ణం పెట్టుకోవాల్సిందే!

Update: 2021-04-14 12:30 GMT
జ‌గ‌న‌న్న పాల‌న‌ పై రెడ్డి  సామాజిక ఎంతో ఆశ పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో రెడ్డి సామాజిక వ‌ర్గం మొత్తం సంఘ‌టిత‌మై.. మ‌నం ఆర్థికంగా పుంజుకోవాల‌న్నా.. మ‌న సామాజిక వ‌ర్గానికి గుర్తింపు రావాల‌న్నా.. జ‌గ‌న్ సీఎం అయితేనే సాధ్యం! అని నిర్ణ‌యించుకుని.. ఆయ‌న‌ను సీఎం చేసేందుకు అనేక రూపాల్లో క‌ష్టించారు. అనుకున్న ప్ర‌కారం.. జ‌గ‌న్‌ను సీఎం చేసుకుని సంతోషించారు. అయితే.. ఈ సంతోషం.. ఎక్కువ సేపు నిల‌బ‌డ‌లేదు. త‌న మంత్రివ‌ర్గంలో సోష‌ల్ ఇంజ‌నీరింగ్ పేరిట‌.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. పోనీలే... స్థానిక ఎన్నిక‌ల్లో అయినా.. మాకు న్యాయం జ‌రుగుతుంద‌ని అనుకున్నారు.

ఇదేవిధంగా టీడీపీ నుంచి వ‌చ్చిన‌, అదేస‌మ‌యంలో వైసీపీనే న‌మ్ముకున్న క‌మ్మ సామాజిక వ‌ర్గం కూడా జ‌గ‌న్‌పై ఆశ‌లు పెట్టుకుని.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌స్తే.. త‌మ‌కు కూడా న్యాయం జ‌రుగుతుంద‌ని.. అనుకున్నారు. కొంద‌రు సీట్లు సైతం త్యాగం చేశారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఇప్పుడు ఈ రెడ్లు, క‌మ్మ‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. ఎంత‌గా అంటే.. జ‌న‌ర‌ల్‌కు ద‌క్కాల్సిన సీట్ల‌ను కూడా వేరే సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించారు. స్థానిక ఎన్నిక‌లు గ‌త నెల‌లో ముగిశాయి. ఈ క్ర‌మంలో రిజర్వ్‌డ్ వ‌ర్గాల‌కు కొన్ని సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు పోగా.. జ‌న‌ర‌ల్ సీట్లు కూడా ఉన్నాయి.

అయితే.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వులు, కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్ ప‌ద‌వుల‌ను ఎవ‌రికీ ప్ర‌క‌టించ‌లేదు. పోటీ ఉంద‌ని తెలిసినా.. ఆయ‌న మౌనంగా ఉన్నారు. ఈక్ర‌మంలో రిజ‌ర్వేష‌న్ సీట్లు పోగా.. జ‌న‌ర‌ల్‌లో అయినా.. త‌మ‌కు ఖ‌చ్చితంగా ఆయా ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాలు భావించాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు అన్ని చోట్లా వారు ప్రాధాన్యం వ‌హించి.. పార్టీని గెలిపించుకున్నారు. తీరా.. ప‌ద‌వుల విష‌యానికి వ‌చ్చే స‌రికి.. మాత్రం అంతా గోప్యంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌.. జ‌న‌ర‌ల్ కులాల‌కు అంటే..రెడ్డి, క‌మ్మ‌ల‌కు కూడా ద‌క్కాల్సిన స్థానాల‌ను బీసీ సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించారు.

వాస్త‌వానికి గెలిపించేందుకు అవ‌స‌రమైన నిధులు స‌మ‌కూర్చింది.. రెడ్డి, క‌మ్మ సామాజిక‌వ‌ర్గాలు. అదేవిధంగా ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వ్యూహాలు వేసింది కూడా ఈ వ‌ర్గాలే. కానీ, ప‌దవుల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని.. అస‌లు రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌ను మాకు ఎలాగూ ఇవ్వ‌రు. ఇక‌, జ‌న‌ర‌ల్ సీట్లే క‌దా .. మాకు దిక్కు. ఇప్పుడు వాటిని కూడా రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీకి చెందిన వారికి కేటాయించేస్తే ఎలా? అనేది వీరి ఆవేద‌న‌, ఆందోళ‌న‌. ముఖ్యంగా ప్ర‌భుత్వం త‌మ‌దే అయితే..త మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించిన రెడ్డి సామాజిక వ‌ర్గం ఈ విష‌యంలో మ‌రింత ఎక్కువ‌గా ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను తీసుకుంటే.. ఇక్క‌ట టీడీపీ ట‌ఫ్ ఫైట్ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు ఇంటింటికి తిరిగి.. పార్టీని గెలిపించారు. ఇక్క‌డి కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠం జ‌న‌ల‌ర్‌కు కేటాయించారు. దీంతో క‌మ్మ వ‌ర్గం ఈ సీటు పై ఆశ‌లు పెంచుకుంది. కానీ, జ‌గ‌న్ మాత్రం ఈ సీటును బీసీకి కేటాయించేశారు. దీంతో క‌మ్మ సామాజిక వ‌ర్గం హ‌ర్ట్ అయింది. అదేంటి మాకు ద‌క్కాల్సిన సీటును రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీకి ఎలా కేటాయిస్తార‌ని ఇప్ప‌టికీ వీరు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఇలా ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాదు.. జ‌న‌ర‌ల్ కేటాయించిన‌.. సీట్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జ‌గ‌న్ వారికి ద‌క్క‌కుండా చేశారు. దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజిక వ‌ర్గాలు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా స‌హ‌కారం లేకుండా గెలుస్తారా? అనే మాట‌లు కూడా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి జ‌గ‌న్ ఏం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News