పీకేపై కన్నబాబు సెటైర్లు... కడిగిపారేశారబ్బా!

Update: 2019-11-05 16:16 GMT
ఏపీలో ఇసుక కొరతపై జనసేనాని పవన్ కల్యాణ్... విశాఖలో మొన్న చేపట్టిన లాంగ్ మార్చ్ మంటలు ఇంకా ఆరలేదనే చెప్పాలి. లాంగ్ మార్చ్ లో సాంతం కారు పై నుంచే షో చేసిన పవన్... మార్చ్ ముగిసిన తర్వాత జరిగిన బహిరంగ సభా వేదికపై నుంచి వైసీపీ ప్రభుత్వంపైనా, ప్రత్యేకించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా తనదైన శైలి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబుపైనా పవన్ విమర్శలు సంధించారు. సరే... ఆ విమర్శలకు సమాధానం చెప్పాలి కదా అన్నట్టుగా మంగళవారం తన సొంతూరు కాకినాడలో మీడియా ముందుకు వచ్చిన కన్నబాబు... పీకేను నిజంగానే కడిగిపారేశారనే చెప్పాలి. ఓ రేంజిలో కన్నబాబు వదిలిన బాణాల్లాంటి మాటలకు అసలు పీకే నుంచి రిప్లై వచ్చే అవకాశాలే లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా పవన్ పై కన్నబాబు ఏ తరహా ఆరోపణలు చేశారన్న విషయానికి వస్తే... ‘భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన టీడీపీతో కలిసి లాంగ్ మార్చ్ చేసిన పవన్ కు ఇసుక కొరతపై మాట్లాడే హక్కే లేదు. ఒక్క సీటు వస్తేనే ఇంతగా మిడిసిపడుతున్న పవన్... ఇంకా కొన్ని సీట్లు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో? రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సినిమాలు వదిలేసి వచ్చానని చెబుతున్న పవన్... యాక్టింగ్ మాత్రం మానుకోలేదు. విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా... జగన్ ను విమర్శించడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. నన్ను తిట్టడం పవన్ కు ఫ్యాషన్ గా మారిపోయింది. నా బతుకులో దాపరికం లేదు. మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనం బతుకులు చూసుకోవాలి. చిరంజీవి గారి వల్లనే రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటుంటా. రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎప్పుడైనా చిరంజీవి పేరు చెప్పారా? గాజువాకలో పవన్ పోటీ చేస్తే చంద్రబాబు ప్రచారం చేయలేదు. మంగళగిరిలో లోకేశ్ పోటీ చేస్తే జనసేన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. 15 రోజుల్లో ఇసుక సమస్యను తీర్చకపోతే.. అమరావతి వీధుల్లో నడుస్తానంటూ పవన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. అమరావతిలో అసలు వీధులే లేవు. చంద్రబాబు చూపింది గ్రాఫిక్స్ మాత్రమే. చంద్రబాబు తప్ప పవన్ కు మరో నేత కనిపించడం లేదు’ అంటూ కన్నబాబు తనదైన శైలిలో పవన్ ను కడిగిపారేశారు.

లాంగ్ మార్చ్ లో పవన్ ప్రస్తావించిన దాదాపుగా అన్ని అంశాలను... ప్రత్యేకించి తనపై సంధించిన విమర్శలకు కన్నబాబు పూర్తిగానే రిప్లై ఇచ్చేశారనే చెప్పాలి. అంతేకాకుండా ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉండి కూడా కన్నబాబు... తాను చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నారు. అదే సమయంలో చిరు వల్లే రాజకీయాల్లోకి వచ్చిన పవన్... ఏనాడైనా చిరు పేరు చెప్పుకున్నారా? అంటూ కన్నబాబు సూటిగానే ప్రశ్నించారు. ఇక టీడీపీ హయాంలో ఇసుక దోపిడీతోనే ఆ పార్టీ నేతలు వందలు, వేల కోట్ల మేర దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేసిన పవన్... లాంగ్ మార్చ్ లో అదే పార్టీ నేతలతో కలిసి సాగిన వైనాన్ని కూడా కన్నబాబు గుర్తు చేశారు. మరి కన్నబాబు ప్రస్తావించిన ఈ అంశాలపై పవన్ ఆన్సరిస్తారా? అసలు వీటిపై స్పందించే దమ్ము పవన్ కు ఉందా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Tags:    

Similar News