కాపుల ఓట్లు కన్సాల్డేట్ ...?

Update: 2021-10-24 14:30 GMT
ఏపీలో వైసీపీ పాలన సగం వరకే వచ్చింది. కానీ అపుడే వచ్చే ఎన్నికల గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ని గద్దె దించడమే టార్గెట్ గా విపక్షాలు రాజకీయ వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ విషయమో ఎవరికి వారే తామే చాంపియన్స్ కావాలని కూడా ఆలోచిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తరువాత చాన్స్ వైసీపీకి వచ్చింది. ఇపుడు దక్కాల్సింది జనసేనకే అన్నది ఆ పార్టీ నేతల మాటగా ఉంది. ఏపీలో జనసేనకు ఏ పార్టీకీ లేని అతి పెద్ద ఆస్తి ఉంది. అదే బలమైన సామాజికవర్గం. కాపులు ఏపీలో ఇప్పటిదాకా పాలితులుగానే మిగిలిపోయారు. వారు పాలకులు కావాలన్న ఆశలు అలాగే ఉండిపోతున్నాయి.

ఇపుడు సరైన సమయం అని ఆ సామాజికవర్గంలోని ఉత్సాహవంతులు భావిస్తున్నారు. ఏపీలో తక్కువ ఓట్ల‌ శాతం ఉన్న కమ్మలు, రెడ్లు పలు మార్లు అధికారం చేపట్టగా లేనిది కాపులకు ఎందుకు చాన్స్ రాదు అన్నదే వారి వాదనగా ఉంది. కాపులు ఐక్యంగా ఉంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుందని కూడా లెక్కలు వేస్తున్నారు. ఏపీలో కాపులంతా ఒకటి కావాలని ఈ మధ్యనే రాజమండ్రి మీటింగులో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు సామాన్యమైనది కాదు, ఆయన ఆవేశంతో ఇచ్చిన నినాదం కూడా కాదు, పక్కా ప్లాన్ తోనే పవన్ ఈ మాటలు అన్నారని చెబుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో మిగిలిన కులాలకు ఉన్న ఐక్యతను రాజకీయ పరిణితిని కాపులు కూడా చూపించాలని ఆ సామాజికవర్గంలోని మేధావులు గట్టిగా కోరుతున్నారు. తాము వేరే కులాల ఐక్యతను చూసి అసూయ చెండంలేదని, తమ వారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నామనే అంటున్నారు. కాపులు అంతా కలసి కట్టుగా ఉంటే ఇటు ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లాల నుంచి అటు దక్షిణ కోస్తా, రాయలసీమ దాకా కూడా బలమైన నాయకత్వం తయారు అవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. కాపులకు ఎన్నో అవకాశాలు వచ్చాయని, వారు మాత్రం వాటిని వాడుకోలేదని కూడా ఆ సామాజికవర్గానికి చెందిన కొందరు విద్యావంతులు ఎత్తి చూపుతున్నారు.

తమకు వేరే కులంతో విభేధాలు ఉన్నాయని ప్రచారం చేయడం కూడా ప్రత్యర్ధుల రాజకీయ వ్యూహాల్లో భాగమే అంటున్నారు. కాపులు ఈ రోజుకు అన్ని పార్టీలకూ మద్దతు ఇచ్చి బోయీలుగానే మిగిలిపోయారని, ఇక మీదట వారే తమ రాతను, జాతి గీతను మార్చుకోవాలని కూడా సూచిస్తున్నారు. కాపులంతా ఒక త్రాటి మీదకు వస్తే ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని చెబుతున్నారు. మరి కాపులంతా 2024 ఎన్నికలకు కన్సాల్డేట్ అవుతారా. గతంలో సాధ్యం కానిది రేపటి ఎన్నికల్లో జరుగుతుందా అంటే ఆశావహంగానే ఆ సామాజికవర్గం పెద్దలు ఉన్నారు. ఈసారి కాపులలో రాజకీయ చైతన్యాన్ని యావత్తు లోకం అంతా చూస్తుందని, వచ్చే ఎన్నికలు మాములుగా ఉండవని అంటున్నారు. ఒక విధంగా కాపులు  జనసేనకు సొంతం చేసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. అంతకంటే మంచి అవకాశం రాదని చెబుతున్నారు. మరి కాపులు కనుక దీని మీద ఆలోచించి ఏకీకృతం అయితే మాత్రం ఏపీలో రేపటి ఎన్నికల్లో సరికొత్త రాజకీయ సునామీనే చూడవచ్చేమో.
Tags:    

Similar News