కామ్ గా ఉండరేం? సిద్దూనే ఐదేళ్లు.. కొత్త రచ్చకు తెర తీశారు

Update: 2023-05-24 13:22 GMT
అధికారంలో లేనప్పుడు దాని కోసం కిందా మీదా పడిపోతారు కాంగ్రెస్ నేతలు. అయ్యో.. పాపం అన్నట్లుగా ప్రజలు ఫీలై.. చేతికి పవర్ ఇచ్చినంతనే.. వారు వ్యవహరించే తీరుతో ప్రజల్లో ఉన్న కాస్తపాటి సానుభూతి కూడా పోయే పరిస్థితి. కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నా.. ముఖ్యమంత్రిగా ఎవరికి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్న పంచాయితీతోనే రోజుల తరబడి సా..గదీసి పరువు తీసుకున్న కాంగ్రెస్ కు ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించట్లేదు.

సీనియర్ నేత సిద్దరామయ్యను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేయాలని నిర్ణయం తీసుకోవటం.. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ బయటకు చెప్పింది లేదు. ఇలాంటి వేళలో.. నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని బాహాటంగా చెప్పటం ద్వారా కొత్త రచ్చకు తెర తీశారు ఎంబీ పాటిల్. సీఎం కుర్చీలో కూర్చొని వారం కూడా కాక ముందే సిద్ధరామయ్యను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఎంబీ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.

ఐదేళ్ల వరకు సిద్దరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో కొత్త చర్చ మొదైలంది. అయితే.. దీనిపై డీకే శివకుమార్ కాస్తంత జాగ్రత్తగా రియాక్టు అయ్యారని చెప్పాలి. 'అధికార పంపిణీ మీద ఎవరు ఏమన్నా నాకు అవసరం లేదు. నేనీ విషయం మీద మాట్లాడను. అధికార పంపిణీ.. ఇతర అంశాలను నిర్ణయించటానికి మల్లికార్జున ఖర్గే ఇతర జాతీయ నేతలు ఉన్నారు. మేం ఇచ్చిన మాట ప్రకారం స్టేట్ డెవలప్ మెంట్ మీదనే ఫోకస్ చేస్తాం' అని వ్యాఖ్యానించారు.

సిద్దూనే ఐదేళ్లు సీఎం అన్న విషయంపై డీకే శివకుమార్ మాదిరే.. ఆయన సోదరుడు కమ్ ఎంపీగా వ్యవహరిస్తున్న డీకే సురేశ్  సైతం జాగ్రత్తగా రియాక్టు అయ్యారు. ఇదిప్పుడు చర్చించే అంశం కాదన్న ఆయన ఏఐసీసీ స్థాయిలో చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా.. సిద్దూ వర్గీయులు తమ నోటిని కాస్తంత అదుపులో ఉంచుకునేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ప్రభుత్వం కొలువు తీరి వారం కూడా కాక ముందే.. ఈ రచ్చేందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Similar News