కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య పోటీ పెరిగిపోతోందా ?

Update: 2023-05-06 12:00 GMT
అధికారంలోకి వచ్చేయటం ఖాయమని సర్వేలు చెబుతున్న నేపధ్యంలో ఇద్దరు నేతల మధ్య పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అవ్వాలనే పట్టుదలతో ఇద్దరు కీలకనేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ మంత్రి డీకే శివకుమార్. ఇద్దరికీ పార్టీతో పాటు అధిష్టానంలో మంచిపట్టుంది. సినియర్ గా, పాలనాదక్షుడిగా, బడుగు, బలహీన వర్గాల్లో పట్టున్న నేతగానే కాకుండా సిద్ధరామయ్యకు క్లాన్ ఇమేజుంది.

ఇదే సమయంలో పార్టీలో ట్రబుల్ షూటర్ గా, పార్టీకి అత్యంత విధేయుల్లో ఒకడిగా, కష్టాల్లో ఉన్నపుడు పార్టీని ఆదుకున్న నేతగానే కాకుండా ఒక్కలిగల్లో బలమైన పట్టున్న నేతగా డీకేకి పేరుంది. స్ధూలంగా చూస్తే ఇద్దరికీ ప్లస్ పాయింట్లున్నాయి. ఇదే సమయంలో మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే  75 ఏళ్ళ  సిద్ధారామయ్య పార్టీని ఆర్ధికంగా ఆదుకున్నది లేదు. పార్టీ ఎప్పుడు కష్టాల్లో పడినా ఆదుకున్నారు, చక్రం అడ్డేశారని ఎవరు చెప్పలేరు.

అలాగే డీకేకి ఉన్న మైనస్సులు ఏమిటంటే అవినీతిపరుడనే ముద్రుంది. మంత్రిగా పనిచేసినపుడు అనేక మార్గాల్లో బాగా వెనకేశాడనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీబీఐ, ఈడీ అనేక కేసులు నమోదుచేసి విచారణ కూడా చేస్తున్నాయి. రేపు డీకే ముఖ్యమంత్రి అవ్వగానే సీబీఐ, ఈడీలు ఏదైనా కేసులో విచారణ, అరెస్టంటే పరిస్ధితి ఏమిటి ? అనేది అతిపెద్ద మైనస్.  మైనస్ మినహా డీకే సమర్ధుడైన నేతగా ఎంతో పాపులర్.

ఇదే సమయంలో సిద్ధరామయ్య మీద ఎలాంటి కేసులు లేవు కాబట్టి విచారణ అన్న సమస్యే తలెత్తదు. కాకపోతే వయసు అయిపోవటం, ఆర్ధికాంశాల్లో డీకేతో సరితూగలేకపోవటం మైనస్సే. అందుకనే ముందుజాగ్రత్తగా ఇద్దరు కూడా తమ వర్గాలను మద్దతుగా రెడీచేసుకుంటున్నారు. చూస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో తీవ్రమైన పోటీ తప్పదనే అనిపిస్తోంది. ఎవరికి ఎక్కువ మద్దతు దొరుకుతుందనే దానిపై వీళ్ళ అదృష్టం ఆధారపడుంది. చూడాలి చివరకు ఏమవుతుందో. 

Similar News