పోల్ డే: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌కాంశాలివే

Update: 2018-05-12 05:06 GMT
అనుకున్న రోజు వ‌చ్చేసింది. దేశ భ‌విష్య‌త్ రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి కీల‌క‌ఘ‌ట్టంలోకి వ‌చ్చేసింది. పోటాపోటీగా సాగిన ప్ర‌చారానికి బ్రేక్ ప‌డిన త‌ర్వాత‌.. షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు (శ‌నివారం) ఉద‌యం నుంచి పోలింగ్ షురూ అయ్యింది.

క‌ర్ణాట‌క‌కు చెందిన 4.96కోట్ల మంది ఓట‌ర్లు త‌మ తీర్పును ఈవీఎంల‌లో నిక్షిప్తం చేయ‌నున్నారు. దేశ రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చే అవ‌కాశం ఉన్న ఈ ఎన్నిక‌ల తుది ఫ‌లితం మ‌రో మూడు రోజుల్లో వెల్ల‌డి కానుంది. హామీలు.. విమ‌ర్శ‌లు.. మాట‌ల దాడి.. ఇలా గ‌డిచ‌న ఆర్నెల్లుగా క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో పోటాపోటీగా సాగిన ప్ర‌చారంపై క‌న్న‌డిగులు ఏం తీర్పు ఇస్తార‌న్న‌ది ఈ రోజు ఈవీఎంల‌లో న‌మోదు కానుంది.  క‌న్న‌డ ప్ర‌జ‌ల తీర్పు ఆధారంగానే బెంగ‌ళూరులోని విధాన‌సౌధ మూడో అంత‌స్తులోని సీఎం కుర్చీలో కూర్చునే నేత ఎవ‌ర‌న్న‌ది డిసైడ్ కానుంది. ఈ కుర్చీలో కూర్చునేందుకు వివిధ రాజ‌కీయ పార్టీల ముఖ్య‌నేత‌లు ఆశ ప‌డుతున్నా.. క‌న్న‌డ ప్ర‌జ‌లు ఎవ‌రి చేతికి అధికారం ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

సాధార‌ణంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లకు జాతీయ రాజ‌కీయాల‌కు పెద్ద‌గా లింకు ఉండ‌దు. కానీ.. ఈసారి జ‌రుగుతున్న క‌ర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగానే జాతీయ రాజ‌కీయాల్లో వాతావ‌ర‌ణం మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌రుస పెట్టి ఓట‌మి పాల‌వుతున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నిక‌లు చాలా కీల‌కం. ఈసారి ఓట‌మి పాలైతే.. ఆ పార్టీని నిరాశ‌..నిస్పృహ నిలువెత్తుగా క‌మ్మేయ‌టం ఖాయం. ఇదిలా ఉంటే.. బీజేపీ ప‌రిస్థితి సైతం ఏ మాత్రం బాగుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజ‌యం ద్వారా.. గ‌డిచిన కొన్నేళ్లుగా సాధిస్తున్న విజ‌యాల‌కు ఒక విలువ ఉంటుంద‌ని బీజేపీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. సౌత్ లో పాగా వేయాల‌న్న త‌మ చిరకాల క‌ల ఇప్పుడు నెర‌వేర‌కుంటే రానున్న రోజుల్లో ఆ అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌లు ముందుగా.. త్వ‌ర‌లో జ‌రిగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎదుర‌య్యే ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కొవాలంటే క‌ర్ణాట‌క‌లో విజ‌యం త‌ప్ప‌నిస‌రి అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. దీంతో.. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు మోడీషాల‌కు కీల‌కంగా మారాయి. మ‌రో ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కు ఈ ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. వ‌రుస ఓట‌మితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ.. ఈసారి ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాను చాట‌కుంటే.. ఆ పార్టీ ఆస్తిత్వానికే ప్ర‌మాదంగా అభివ‌ర్ణిస్తున్నారు. ఇలా.. ప్ర‌తి పార్టీకి ఏదో ర‌కంగా కీల‌క‌మైన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ నేప‌థ్యంలో కీల‌క‌మైన టాప్ 10 అంశాల్లోకి వెళితే..

1. ఈ రోజు పోలింగ్ జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు సంబందించిన ఫ‌లితాలు ఈ నెల 15న వెల్ల‌డి కానున్నాయి.

2. మొత్తం 224 స్థానాల‌కు 222 స్థానాల్లోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

3. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటుకు 123 స్థానాల్లో గెలుపు అవ‌స‌రం.

4. కాంగ్రెస్‌.. బీజేపీలు రెండు గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. రెండు పార్టీలూ మెజార్టీ సాధిస్తామ‌ని చెబుతున్నాయి.

5. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓటర్లు ఎంత‌గా ఉన్నార‌న్న విష‌యాన్ని లైవ్ లో తెలుసుకునేలా యాప్ రూపొందించారు.

6. యాప్ సాయంతో.. ఓట్లు వేసేందుకు భారీ క్యూలైన్ల వ‌ద్ద నిలుచోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

7.  రాష్ట్రం మొత్త‌మ్మీదా 50 స్థానాల్లో త్రిముఖ పోటీ జ‌ర‌గ‌నుంది. తుది ఫ‌లితంపైన ఈ 50 స్థానాలు కీల‌కం కానున్నాయి.

8. కాంగ్రెస్ గెలిస్తే సిద్ద‌రామ‌య్య‌.. బీజేపీ గెలిస్తే యడ్యూర‌ప్ప‌.. హంగ్ ఏర్ప‌డి జేడీఎస్ కు ఎక్కువ సీట్లు సొంతం చేసుకుంటే కుమార‌స్వామి సీఎం అయ్యే అవ‌కాశం

9. సీఎం సిద్ద‌రామ‌య్య రెండు చోట్ల (చాముండేశ్వ‌రి.. బాదామి).. మాజీ సీఎం యడ్యూర‌ప్ప శికారిపుర‌.. మాజీ ముఖ్య‌మంత్రి జేడీఎన్ నేత కుమార‌స్వామి చెన్న‌ప‌ట్నం.. రామ‌న‌గ‌ర రెండుచోట్లా బ‌రిలో ఉన్నారు.

10. ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ మోసం చేశార‌న్న భావ‌న‌లో క‌ర్ణాట‌క‌లోని తెలుగువారు ఉన్నారు. రాష్ట్రం మొత్త‌మ్మీదా తెలుగువారు ప్ర‌భావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాలు 70 వ‌ర‌కూ ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల విజ‌యంలో తెలుగువారి తీర్పు కీల‌కం కానుంది.

అంకెల్లో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల పోలింగ్‌

మొత్తం స్థానాలు 224
ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ది 222 నియోజ‌క‌వ‌ర్గాలు
పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు 2600
మొత్తం ఓట‌ర్లు 4,96,82,537
పురుష ఓట‌ర్లు 2,52,05,990
మ‌హిళా ఓట‌ర్లు 2,44,71,995
ట్రాన్స్ జెండ‌ర్ ఓట్లు 4,552
మొత్తం పోలింగ్ కేంద్రాలు 58,546
ఎన్నిక‌ల‌కు ప‌ని చేస్తున్న సిబ్బంది 3.5 ల‌క్ష‌లు
అతి పెద్ద నియోజ‌క‌వ‌ర్గం హ‌ల్వాల్ (2,782 చ‌ద‌ర‌పు మైళ్లు)
అతి చిన్న నియోజ‌క‌వ‌ర్గం దాస‌ర‌హ‌ళ్లి (8.91 చ‌ద‌ర‌పు మైళ్లు)
గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు
కాంగ్రెస్ 122
బీజేపీ 40
జేడీఎస్ 40
Tags:    

Similar News