భార్య‌ల‌ పై క‌ర్ణాట‌క హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

Update: 2023-07-06 09:00 GMT
"తిని తొంగుటానంటే కుద‌ర‌దు.. మీరు కూడా ఏదో ఒక ప‌నిచేసి.. డ‌బ్బు సంపాయించుకోవాలి. పూర్తిగా భ‌ర్త‌ పైనే ఆధార‌ప‌డి పోతే ఎలా?" అంటూ.. విడాకుల కేసు లో భ‌రణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన ఓ భార్యామ‌ణిని ఉద్దేశించి క‌ర్ణాక‌ట హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌ర్ణాట‌క‌ కు చెందిన మ‌హిళ ఒక‌రు ఉమ్మ‌డి కుటుంబాని కి ఇష్ట‌ప‌డ‌క‌.. భ‌ర్త నుంచి తెగ‌తెంపులు చేసుకుంది. ఈక్ర‌మం లో కోర్టు కూడా ఆమెకు విడాకులు మంజూరు చేసింది.

విడాకుల సందర్భంగా ఆమెకు నెల‌నెలా భ‌ర‌ణం ఇవ్వాల‌ని స‌ద‌రు భ‌ర్త‌ను కోర్టు ఆదేశించింది. అయితే.. ఇటీవ‌ల ఆయ‌న త‌న భార్య‌కు ఇస్తున్న భ‌రణం లో కొంత మొత్తం త‌గ్గించారు. దీంతో ఆమె కోర్టుకెక్కింది. నిర్దేశిత భ‌ర‌ణాన్ని త‌న భ‌ర్త త‌గ్గించార‌ని క‌ర్ణాట‌క హైకోర్టు లో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌ ను విచారించిన ధ‌ర్మాస‌నం.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అస‌లు విడాకులు ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించింది. దీనికి ఆమె అత్త‌గారి తో క‌లిసి ఉండ‌డానికి సుముఖంగా లేన‌ని అందుకే విడాకులు తీసుకున్న‌ట్టు తెలిపింది.

ఈ వివ‌ర‌ణ‌ పై కోర్టు నివ్వెర పోయింది. భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం భ‌ర్త కుటుంబ‌స‌భ్యు ల‌తో భార్య‌ క‌లిసి జీవించాల‌ని, వారి క‌ష్ట‌సుఖాల్లోనూ పాలు పంచుకోవాల‌ ని సూచించింది. అయితే.. ఈ కేసు లో భార్య అత్త‌గారింట్లో ఉండేందు కు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డాన్ని కోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఆమె పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అదేస‌మ‌యం లో భ‌ర్త నుంచి భ‌ర‌ణం త‌గ్గింద‌న్న వాద‌న‌ను కూడా తోసిపుచ్చింది.

"మీరు కూడా ఏదైనా ప‌నిచేసుకుని సంపాయించుకునే మార్గాలు వెతుక్కోవాలి. కేవ‌లం భ‌ర్త భ‌ర‌ణం పైనే ఆధార‌ప‌డితే కుద‌ర‌దు. భ‌ర్తే అంతా ఇవ్వాల‌ని లేదు. అదేస‌మ‌యం లో భ‌ర‌ణం తీసుకోవాల్సిన అవ‌స‌రాన్ని కూడా భార్య వివ‌రించాలి" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో స‌ద‌రు భార్య వేసిన పిటిష‌న్‌ ను కోర్టు తోసిపుచ్చింది.

Similar News