శృంగారానికి నిరాకరించడం తప్పే కానీ... కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Update: 2023-06-20 16:00 GMT
భాగస్వామి తో శ్రృంగారాన్ని నిరాకరించడం, సహకరించకపోవడం వంటి విషయాల పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా హిందూ వివాహ చట్టాన్ని ప్రస్తావిస్తూనే.. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ని కూడా పరిగణ లోకి తీసుకోవాలన్నట్లుగా సూచించింది. దీంతో.. మరోసారి ఈ చర్చ తెర పైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... కర్ణాట కు చెందిన ఒక మహిళ కు 2019 డిశెంబర్ లో వివాహం అయ్యింది. అయితే ఆమె తో శారీరక బంధాన్ని ఏర్పరుచుకునేందుకు భర్త నిరాకరించాడు. దానికి కారణం ఆమె భర్త తీవ్రస్థాయిలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడమే అని తెలుస్తుంది. దీంతో పెళ్లైనతర్వాత కేవలం 28 రోజులు మాత్రమే అత్తారింట్లో కాపురం చేసిన ఆమె.. పుట్టింటికి వచ్చేసింది.

అనంతరం 2020 ఫిబ్రవరి లో ఐపీసీ సెక్షన్‌ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద భర్త, అత్తామామల పై కేసు పెట్టింది. ఇదే సమయం లో హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాల ని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో ఈమె పిటిషన్‌ ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు 2022 నవంబరులో వీరి వివాహాన్ని రద్దు చేసింది.

అయినా కూడా అత్తింటివారి పై పెట్టిన క్రిమినల్‌ కేసు (సెక్షన్ 498 ఏ) ను మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో తనపైనా, తన తల్లిదండ్రుల పైనా నమోదైన ఛార్జ్ షీట్ ను సవాల్‌ చేస్తూ ఆ భర్త కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించాడు. దీంతో ఇటీవల విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన న్యాయస్థానం... ప్రేమ అంటే కేవలం మనసుల కు సంబంధించినది మాత్రమే గానీ.. శారీరక బంధం కాదని ఆమె భర్త విశ్వసిస్తున్నాడు. అయితే, వివాహం చేసుకున్న భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం.. హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ... ఐపీసీ సెక్షన్‌ 498ఏ ప్రకారం అది నేరం కిందకు రాదు అని వ్యాఖ్యానిస్తూ... ఆ క్రిమినల్ కేసు ను కొట్టేసింది.

Similar News