అక్క‌డ ఎమ్మెల్యే అన్నేసి కోట్లు ప‌లుకుతున్నాడట‌!

Update: 2019-07-04 05:15 GMT
గ‌డిచిన కొద్ది రోజులుగా  క‌ర్ణాట‌క‌లో ప‌వ‌ర్ గేమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. నోటి వ‌ర‌కూ వ‌చ్చిన అధికారం సిత్రంగా చేజారిపోయిన షాక్ నుంచి బీజేపీ ఇంకా తేరుకున్న‌ది లేదు. న్యాయ‌బ‌ద్ధంగా త‌మ‌దే అధికార‌మంటూ వాదిస్తున్న క‌మ‌ల‌నాథులు.. ఏం చేసైనా స‌రే..క‌ర్ణాట‌క‌లో కాషాయ జెండాను ఎగురువేయాల‌న్న క‌సిగా ఉన్నారు. ఇందుకోసం వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. దీంతో.. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌రిస్థితి దిన‌దిన గండంగా మారింది.

తాజాగా ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ కావ‌టం తెలిసిందే. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం విష‌యంలో చోటు చేసుకున్న సంక్లిష్ట సంక్షోభ వేళ‌.. క‌ర్ణాట‌కలో అధికార బ‌దిలీకి చేయాల్సిన ప‌ని చేసేస్తే పోలా అన్న‌ట్లుగా బీజేపీ నేత‌లు కొంద‌రు మ‌హా దూకుడుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. రాజ‌కీయ బేరాలు ఊపందుకున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గోడ దూకితే చాలు.. మొత్తం వ్య‌వ‌హారం మారిపోవ‌ట‌మే కాదు.. క‌ర్ణాట‌క క‌మ‌ల‌నాథుల హ‌స్త‌గ‌తం అయ్యే ప‌రిస్థితి. ఈ క్ష‌ణం కోసం కోటి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్న క‌మ‌ల‌నాథులు ఎంద‌రో. ఇదిలా ఉంటే.. త‌న‌కు వ‌చ్చిన భారీ ఆఫ‌ర్ ను బ‌య‌ట‌కు వెల్ల‌డించి సంచ‌ల‌నం సృష్టించారు క‌ర్ణాట‌క జేడీఎస్ ఎమ్మెల్యే కె. మాధ‌వ్‌. పిరియ‌ప‌ట్న‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన సంద‌ర్భంలో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

త‌న‌కు రూ.40 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. అయితే.. ఇంత భారీ మొత్తాన్ని ఎవ‌రు? ఎందుకు ఇస్తార‌న్న విష‌యం మీద మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. రూ.40 కోట్ల ఆఫ‌ర్ తో పాటు రెండుసార్లు భారీగా క్యాష్ తీసుకొని నా గ‌ది వ‌ద్ద‌కు వ‌చ్చారు. వారిని వెంట‌నే వెళ్లిపోవాల‌ని లేకుండా ఏసీబీకి ప‌ట్టిస్తాన‌ని తానుచెప్ప‌టంతో వాళ్లు వెళ్లిపోయిన‌ట్లుగా చెప్పారు.

ఈ ఎమ్మెల్యే వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ర‌మేశ్ జార్కి హోళీ రూ.80 కోట్లు డిమాండ్ చేశార‌ని.. తాను రాజీనామా చేయ‌కూడ‌దంటే ఈ భారీ మొత్తాన్ని ఇవ్వాలంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఇలా ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40కోట్ల నుంచి రూ.80 కోట్ల వ‌ర‌కు వ‌స్తున్న ఆఫ‌ర్లు వింటున్న వారి నోట మాట రావ‌టం లేదు. ఇదిలా ఉంటే.. తాము కోట్ల‌కు ఆశ‌ప‌డ‌మ‌ని చెబుతున్న వారు లేక‌పోలేదు. మొత్తంగా వంద‌ల కోట్లే క‌ర్ణాట‌క అధికార పీఠాన్ని ఎవ‌రు ద‌క్కించుకుంటార‌న్న‌ది తేల్చ‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News