నేపాల్ లోని ఖాట్మండులో గల త్రిభువన్ విమానాశ్రయంలో ఈ రోజు ఘోర విమాన ప్రమాదం జరిగింది. 67 మంది ప్రయాణిస్తున్న యూఎస్-బంగ్లా ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఢాకా నుంచి బయలుదేరి ఇవాళ మధ్యాహ్నం ఖాట్మండు విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా హఠాత్తుగా కూలింది. ఆ పరిణామంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు విమానం మొత్తం ఆవరించడంతో క్షణాల్లోనే విమానం పూర్తిగా దగ్ధమై పోయింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆ మంటల ధాటికి విమానంలో చిక్కుకొని 50 మంది సజీవదహనమయ్యారు.
ప్రమాద ఘటన వివరాలు తెలియగానే నేపాల్ ఆర్మీ విమానాశ్రయానికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో బయటపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి విమానాశ్రయాన్ని మూసివేశారు.
నేపాల్ లో గల ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఇదొక్కటే కావడం విశేషం. ఆ ప్రాంతమంతా కొండలతో నిండి ఉండడంతో తరచూ విమాన ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలుస్తోంది.