చుక్కలెన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే: కవిత సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-22 09:38 GMT
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడేనని గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో ఎన్ని పార్టీలున్నా.. కేసీఆర్‌ ఒక్కరేనని స్పష్టం చేశారు.

తాజాగా ఖమ్మంలో జరిగిన టీడీపీ శంఖారావం సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే ఉన్నట్టు.. తెలంగాణలో పార్టీలు ఎన్ని ఉన్నా.. కేసీఆర్‌ ఒక్కడే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ లో కవిత మీడియాతో మాట్లాడారు.

టీడీపీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ కాదన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా అదే జరుగుతుందన్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నారని, పార్టీని పునర్మించాలని పిలుపునిస్తున్నారన్నారు. అయినా సరే తెలంగాణ ప్రజలెవరూ టీడీపీని పట్టించుకోబోరని స్పష్టం చేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్‌ కాబోతుందంటూ.. దానికి కాగా ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన సభ అంచనాలకు మించి విజయవంతమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో పేరున్న నేతలు పెద్దగా లేకపోయినా ఇప్పటికీ ఆ పార్టీకి కార్యకర్తల బలం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహించిన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారనే చర్చ జరుగుతోంది.

చంద్రబాబు సైతం తన హయాంలో జరిగిన ఐటీ అభివృద్ధిని ప్రస్తావించారు. 25 ఏళ్ల క్రితమే బిల్‌ గేట్స్‌ ను రాష్ట్రానికి తీసుకొచ్చానని గుర్తు చేశారు. భారత్‌ బయోటెక్‌ ను ప్రోత్సహించడం వల్లే ఆ కంపెనీ కోవిడ్‌ టీకాను కనిపెట్టగలిగిందన్నారు. అలాగే హైదరాబాద్‌ లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ను సైతం తెచ్చానని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం టీడీపీ సభ తెలంగాణలో కొత్త చర్చకు దారితీసింది. ఓవైపు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని కొంత ఆందోళనకు గురిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కుమార్తె కవిత ఇలా ప్రతిస్పందించారని అంటున్నారు. తెలంగాణలో ఎన్ని పార్టీలున్నా కేసీఆర్‌ ఒక్కడేనని చెప్పడం ద్వారా ప్రజలంతా కేసీఆర్‌ వైపే ఉంటారనేది కవిత ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు. మరోవైపు టీడీపీ తెలంగాణలో అన్ని ముఖ్య పట్టణాల్లో భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ ప్రభావం ఏమాత్రం ఉంటుందనే చర్చ మొదలైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News