తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంత తొంద‌ర‌గా ఉంద‌ట‌!

Update: 2018-09-25 09:14 GMT
వినే వాళ్లు ఉంటే చెప్పే వాళ్లు చెల‌రేగిపోతారంటారు. అదెంత నిజ‌మో అంద‌రికి తెలిసిందే. రాసేటోళ్లు ఉండాలే కానీ.. చెప్పేటోళ్లు ఏమైనా చెబుతార‌న్న విష‌యాన్ని తాజాగా అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌. క్వ‌శ్చ‌న్లు వేయాలి కానీ.. క‌న్ఫ్యూజ్ చేసేలా ఉండొద్దు.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా అస‌లు ఉండొద్దు.. మైలేజీ విష‌యంలో మిల్లీ మీట‌ర్ కూడా త‌గ్గొద్ద‌న్న‌ట్లుగా ఇంట‌ర్వ్యూలు అచ్చేయ‌టం.. అందుకు ఒప్పుకుంటేనే ఇంట‌ర్వ్యూలు అన్న‌ట్లుగా మాట్లాడుకోవ‌టం లాంటివి ఈ మ‌ధ్య‌న ఎక్కువైన‌ట్లుగా సీనియ‌ర్ మీడియా మిత్రులు త‌ర‌చూ త‌మ త‌మ అంత‌ర్గ‌త భేటీల్లో చెబుతుంటారు.

కొన్ని ఇంట‌ర్వ్యూలు చూసినంత‌నే ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్న‌ట్లుగా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఇంట‌ర్వ్యూ ఒక‌టి ఒక మీడియా సంస్థ అచ్చేసింది.  కేసీఆర్ ఇమేజ్ ను మ‌రింత భారీగా పెంచేయ‌టం.. ఛ‌.. ఛ‌.. కేసీఆర్ ఏంటి?  సీఎం ప‌ద‌వేంటి?.. ఏదో మా నాన్న కాబ‌ట్టి మంచిత‌నంతో స‌ర్దుకున్నారు కానీ అన్న‌ట్లుగా ఆమె చెప్పిన మాట‌లు చూస్తే.. క‌విత కాన్ఫిడెన్స్ కు అవాక్కు అవ్వాల్సిందే.

అంతేనా?.. త‌మ‌కు న‌చ్చిన‌ప్పుడు ఆకాశానికి ఎత్తేయ‌టం.. తేడా వ‌చ్చిన‌ప్పుడు తొక్కి పాతాళానికి తొక్కేయ‌టం కేసీఆర్ ఫ్యామిలీకి అల‌వాటే. తెలంగాణ ఇచ్చిన‌ప్పుడు దేవ‌త‌గా అభివ‌ర్ణించిన సోనియాను.. అమ్మా.. బొమ్మా అనే వ‌ర‌కూ వెళ్ల‌టం కేసీఆర్ ఫ్యామిలీకే చెల్లుతుంది. సోనియానేనా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను సైతం భ్ర‌మిత్ షా అనేయ‌టం కూడా క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే చెల్లు. అలాంటి  కుటుంబం ఎవ‌రినైనా ఏమైనా అన‌కుండా ఉందంటే అది ఎన్టీవోడినేన‌ని చెప్పాలి.

ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన వేళ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఎన్టీఆర్ మీద స‌న్న‌గా రెండు.. మూడు మాట‌లు అన్నా అవేమీ పెద్ద‌గా హైలెట్ కాలేదు. ఆ విష‌యాన్ని వ‌దిలేస్తే.. తాజాగా ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాడు ఎన్టీఆర్ ఎలా అయితే ఢిల్లీలో తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా అనుకునే వారో.. ఇవాళ కేసీఆర్‌ను కూడా ఢిల్లీలో తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా చూస్తున్న‌ట్లు చెప్పారు.

ద‌క్షిణాదిలో మ‌ద‌రాసీలే కాదు.. తెలుగువారు కూడా ఉంటార‌ని ఆ రోజు ఎన్టీఆర్ కార‌ణంగా దేశానికి ఎలా తెలిసిందో.. ఇవాళ తెలుగువారే కానీ తెలంగాణ వారు కూడా ఉంటార‌న్న భావ‌న కేసీఆర్ వ‌ల్ల క‌లిగింద‌న‌ని చెప్పుకొచ్చారు. (ఆంధ్రా.. తెలంగాణ వారు మాట్లాడేది తెలుగేగా?  అలాంట‌ప్పుడు తెలుగుకు భిన్న‌మైన మాట‌లేందో?)

క‌విత మాట‌లు వింటే ఆంధ్రోళ్లు కాస్తా తెలుగోళ్లు.. తెలంగాణ వారు కాస్తా మ‌రేదో అయిన‌ట్లుగా అనిపించ‌ట్లేదు?  ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేస్తే.. తాజాగా తెలంగాణ ప్ర‌జ‌లంతా.. ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు అంటూ ఆవురావుర‌మంటున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. గ‌తంలో ఉప ఎన్నిక‌ల వేళ‌లో ప్ర‌చారానికి వెళితే.. ఎన్నిక‌లు ఎందుకు వ‌చ్చాయ‌ని త‌మ‌ను అడిగే వార‌ని.. ఇప్పుడు తాము గ్రామాల‌కు వెళితే.. ఎన్నిక‌లు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నార‌ని.. చెబితే న‌మ్మ‌రు కానీ.. ఎన్నిక‌ల కోసం ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని.. త్వ‌ర‌గా ఎన్నిక‌లు జ‌రిగితే.. టీఆర్ ఎస్‌ కు అధికారాన్ని అప్ప‌జెప్పేసి త‌మ ప‌నులు పూర్తి చేసుకోవాల‌న్న ఆశ‌లో ఉన్న‌ట్లుగా చెప్పారు. చెప్పిందంతా పొల్లు పోకుండా రాస్తామంటే.. క‌వితలాంటోళ్లు ఇలా మాట్లాడ‌క ఎలా మాట్లాడ‌తారు చెప్పండి?
Tags:    

Similar News