నాన్న‌ను సాయం చేయ‌మ‌నొచ్చుగా?

Update: 2015-09-28 09:49 GMT
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై తెలంగాణ అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ వైఖ‌రి విచిత్రంగా మారింది. ఓ ప‌క్క రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై క‌నిపిస్తున్న దానికి భిన్నంగా.. ఆత్మ‌హ‌త్య‌ల్లో నిజం అంటూ కొత్త పాయింట్ తీసి లెక్క‌లు చెబుతున్న వైనం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఓప‌క్క అన్న‌దాతల ఆత్మ‌హ‌త్య‌ల కార‌ణంగా ఆయా కుటుంబాలు రోడ్డున ప‌డే ప‌రిస్థితుల్లో.. వారిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఆత్మ‌హ‌త్య‌ల్లో నిజం అంటూ స‌రికొత్త చ‌ర్చ‌ను తెర‌పైకి తీసుకురావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై తెలంగాణ స‌ర్కారు క‌రుకుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. వారిప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విమ‌ర్శ‌లు భారీగా వెల్లువెత్తుతుంటే.. మ‌రోవైపు ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కుమార్తె తీసుకుంటున్న నిర్ణయాలు మ‌రో విధ‌మైన చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.

తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు స్పందిస్తూ.. కేసీఆర్ కుమార్తె క‌విత విరాళాలు ఇచ్చి ఆదుకోవాలంటూ పిలుపునివ్వ‌టం తెలిసిందే. ఆమె మాట‌కు స్పంద‌న‌గా ప‌లువురు స్పందించి.. విరాళాలుప్ర‌క‌టించారు. తాజాగా ఆమె మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. ఎంపీగా త‌న‌కు వ‌చ్చే జీతాన్ని ఏడాది పాటు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఓప‌క్క తండ్రి ఏమో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు అంతా ఒక ఫార్సుగా తేల్చేస్తుంటే.. మ‌రోవైపు ఆయ‌న కుమార్తె మాత్రం త‌న ఏడాది జీతాన్ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌రైతుల కోసం వెచ్చిస్తాన‌ని చెప్ప‌టం విచిత్ర‌మైన విష‌యంగా చెప్పాలి. నిజానికి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల కుటుంబాల్ని ఆదుకోవాల‌ని భావిస్తే.. త‌న ఏడాది జీతాన్ని విరాళంగా ఇచ్చేబ‌దులు.. అంతుకు మించి త‌న తండ్రి.. ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్  ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. వారిని ఆదుకునే విష‌యంలోనూ.. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతు కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చేలా రెండు మాట‌లు చెప్ప‌మ‌ని ఒప్పిస్తే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News