అందని మంత్రి పదవి పుల్లన

Update: 2015-07-17 10:24 GMT
    మోడీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. మోడీ ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పుష్కర నిధుల కేటాయింపుల్లో కూడా కేంద్రం ఆంధ్రాకే ఎక్కువ నిధులు కేటాయించిందని విమర్శించారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మోడీ సర్కార్‌కు అనుకూలమో, వ్యతిరేకమో కాదని, తటస్థమేనని పేర్కొన్న ఆమె.. బేగంపేట ఎయిర్‌ పోర్టును ఆర్మీకి అప్పగించే కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. దీనిపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.  కేంద్రంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన కవిత ఇక అది అందని ద్రాక్షేనని తెలుసుకుని పులుపు మాటలు మొదలుపెట్టినట్లున్నారు మరి.

మోడీ ప్రభుత్వంలో కవితకు మంత్రి పదవి కోసం గతంలో తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే... ఎన్నికల సమయంలో ఆమె మోడీకి వ్యతిరేకంగా చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆరెస్సెస్ అడ్డుచెప్పడం.. ఇతర సమీకరణాల వల్ల ఆమెకు పదవి రాలేదు. మొన్నమొన్నటి వరకు టీఆరెస్ నుంచి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. అయితే, అవేమీ ఫలించలేదు. ఆ సమయంలో కవిత మోడీ విషయంలో, కేంద్రం విషయంలో ఆచితూచి మాట్లాడేవారు. అయితే... మంత్రి పదవిపై ఆశలు పూర్తిగా పోవడంతో ఆమె ఇప్పుడు స్పీడు పెంచినట్లుగా తోస్తోంది.
Tags:    

Similar News