సచివాలయ ఓపెనింగ్ వేళ.. కొత్త శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్న కవిత

Update: 2023-05-02 06:42 GMT
కొన్ని సందర్భాల్లో సలహాలు ఇచ్చే కన్నా.. వాటికి దూరంగా ఉండటానికి మించిన ఉత్తమమైపని మరొకటి ఉండదు. తెలివైన వారు.. తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చరు. తామిచ్చే సలహాలు తర్వాతి రోజుల్లో సమస్యలుగా మారే వీలుందన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి.. అలాంటి ఎపిసోడ్ లకు దూరంగా ఉంటూ ఉంటారు. కానీ.. ఆ విషయంలో ఎమ్మెల్సీ కవిత అంత దూరం ఆలోచించలేదన్నట్లుగా తాజా పరిస్థితి మారింది.

కొత్త సచివాలయాన్ని ప్రారంభించే సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ మీడియా సంస్థలకు చెందినకొందరు మీడియా ప్రతినిధులను హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఆహ్వానించటం తెలిసిందే. ఇందుకోసం వారికి విమాన టికెట్లతో పాటు, ఫైవ్ స్టార్ హోటల్లో బస.. ప్రత్యేక వాహన సౌకర్యంతో సహా పలు సదుపాయాల్ని కల్పించిన సంగతి తెలిసిందే. దాదాపు 70కు పైగా ఉన్న ఈ మీడియా ప్రతినిధుల రాచమర్యాదల ఎపిసోడ్ పై తెలంగాణ మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఉద్యమ సమయంలో పార్టీకి.. కేసీఆర్ కు.. ఆయన కుటుంబానికి అండగా నిలవటమే కాదు.. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు అధికారంలోకి రావటంలోనూ హైదరాబాద్ కు చెందిన పలువురు మీడియాప్రతినిధులు కీ రోల్ ప్లే చేశారని చెప్పాలి. మరి.. అలాంటి వారిలో పలువురికి కనీసం మీడియా పాసులు ఇవ్వటానికి సైతం ససేమిరా అన్న కేసీఆర్ సర్కారు..సంబంధం లేని రాష్ట్రాలకుచెందిన పాత్రికేయుల్ని హైదరాబాద్ కు రప్పించి.. వారికి రాచమర్యాదలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. సొంత రాష్ట్రంలో.. అందునా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ ఎదురుకాని రీతిలో ఇంతటి అవమానం వెనుక ఎవరు ఉన్నారు? అన్నఆరా మొదలైంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా ప్రతినిధుల్ని హైదరాబాద్ కు రప్పించి వారిలో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు.

నిజానికి ఈ తరహా నిర్ణయాల్ని కేటీఆర్ తీసుకుంటారని భావిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా ఎమ్మెల్సీ కవిత తీసుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న వారంతా విస్మయానికి గురి అవుతున్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన పాత్రికేయుల్ని ఆహ్వానించటం తప్పు పట్టరు. కానీ.. స్థానికంగా ఉన్న వారిని కనీసం చూడను కూడా చూడకుండా.. ప్రారంభోత్సవ వేళ మండే ఎండలో ఎండిపోయేలా చేసి.. పుల్లకూర లాంటి వేరేరాష్ట్రాలకుచెందిన వారికి రాజవైభోగాలు కల్పించిన వైనంపై పలువురు సీనియర్ పాత్రికేయులకు మంట పడుతోంది.

రాజకీయంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడో.. మరేదైనా ఫేవర్ అవసరమైనప్పుడో రిక్వెస్టు చేసే గులాబీ బాస్ అండ్ కో.. ఇలాంటి సందర్భాల్లో కుక్కను చూసేదాని కన్నా హీనంగా తమ పట్ల వ్యవహరించారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ తరహా డ్యామేజ్ మిగిలిన వారికి ఓకే.. కానీ ఎమ్మెల్సీ కవిత లాంటి వారికి మాత్రం నష్టం వాటిల్లేలా చేస్తుందంటున్నారు. నిజానికి ఇలాంటి వ్యవహారాల్లో కేటీఆర్ ఎంట్రీ ఇవ్వకుండా.. కవితకు అసైన్ చేయటం ఏమిటి?  అన్నది ప్రశ్న.

ఒకవేళ చేశారే అనుకోండి. ఎదురయ్యే విపరిణామాల్ని చర్చించి.. మధ్యే మార్గంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. లేదంటే.. తమ అమ్ముల పొదిలో బలమైన ఆయుధమైన విభజించి పాలించు విధానాన్ని పాటించినా బాగుండేది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పిలింపించి.. తమను ఇంతగా అవమానించటం ఏమిటంటూహైదరాబాద్ మీడియా ప్రతినిధులు పలువురు నూరుతున్న కత్తులు.. వాడిగా తయారై.. గులాబీ వర్గానికి ఇబ్బందికరంగా మారతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త శత్రువుల్ని కొని తెచ్చుకోవటం అవసరమా?అన్నది అసలు ప్రశ్న. దీనికి ఎమ్మెల్సీ కవిత ఏమంటారో?

Similar News