ఎంపీ క‌విత‌కు ఈ ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌క‌మే

Update: 2017-08-22 06:05 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌ - నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత సామర్థ్యానికి ప‌రీక్ష ఎదుర‌య్యే సంద‌ర్భం తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయిని - రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాలు తీర్చ‌డంలో కీల‌క‌మైన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికకు నగారా మోగింది. ఈ ఎన్నిక‌లు సాదాసీదా అనుకోవ‌డానికి లేద‌ని అంటున్నారు. ఎందుకంటే టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘ‌మైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఎంపీ క‌విత వ్య‌వ‌హరిస్తున్నారు. గ‌త కొద్దికాలంగా సింగ‌రేణిలో టీఆర్ ఎస్‌ కు ప‌ట్టు త‌గ్గుతుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌లు అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

సింగ‌రేణి కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ అయిన వార‌స‌త్వ ఉద్యోగం అమ‌లుకు మోక్షం క‌లిగిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్దికాలం క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనిపై ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించ‌గా అక్క‌డ స‌ర్కారు చుక్కెదురు అయింది. వార‌స‌త్వ ఉద్యోగాల ప్ర‌క్రియ నిలిచిపోయింది. ఈ ఎపిసోడ్‌ తో టీఆర్ ఎస్ పార్టీ - ప్ర‌భుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే అధికార పార్టీ ఎన్నిక‌ల‌కు పట్టుబ‌ట్ట‌లేద‌నే ప్ర‌చారం కూడా ఉంది. అయితే హైదరాబాద్‌ లోని సింగరేణిభవన్‌ లో అన్ని కార్మిక సంఘాలతో కలిపి నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నిక‌ల‌ షెడ్యూల్‌ ను ప్రకటించారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ సంఘాన్ని గెలిపించ‌డం ఎంపీ క‌విత భుజ‌స్కందాల‌పై ఉంద‌ని అంటున్నారు. ఆమె స‌త్తాను బ‌య‌ట‌పెట్టే ఎన్నిక‌లుగా ఇవి ఉంటాయ‌ని చెప్తున్నారు. మ‌రోవైపు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించ‌నున్నారు.
Tags:    

Similar News