క‌విత మాట‌ను గూగుల్ వింటుందా?

Update: 2018-09-28 04:43 GMT
ఆస‌క్తిక‌ర రిక్వెస్ట్ చేశారు టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత‌. తాజాగా ఆమె ప్ర‌ఖ్యాత సెర్చింజ‌న్ గూగుల్‌కు కొత్త త‌ర‌హా రిక్వెస్ట్ పెట్టేశారు. తెలంగాణ‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మందికి పైగా మ‌హిళ‌లు ఆడుకునే బ‌తుక‌మ్మ పండుగ చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టాల‌ని ఆమె కోరుతున్నారు.

ఏదో రిక్వెస్ట్ చేశామంటే చేశామ‌న్న‌ట్లు కాకుండా గూగుల్ ఇండియా ఎండీ రాజ‌న్ ఆనంద‌న్ ను కోరారు. త‌నకు ఇమేజ్ తెచ్చి పెట్టిన బ‌తుక‌మ్మ‌తో ఎంత‌లా వాడుకోవాలో క‌విత‌కు తెలిసిన‌ట్లుగా మ‌రెవ‌రికీ తెలీదేమో. ఇప్ప‌టికే బ‌తుక‌మ్మ పండుగ కోసం ఏటా రూ.10 కోట్ల‌కు పైగా నిధుల‌ను త‌న తండ్రి స‌ర్కారు చేత విడుద‌ల చేయించుకునే విష‌యంలో విజ‌య‌వంతం అవుతున్న క‌విత‌.. తాజాగా బ‌తుక‌మ్మ డూడుల్ ను గూగుల్ పెట్టాల‌న్న రిక్వెస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీనికి కార‌ణం లేక‌పోలేదు. రిక్వెస్ట్ చేయ‌టం బాగానే ఉన్నా.. క‌విత చేస్తున్న వాద‌న పైనే ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. బ‌తుక‌మ్మ‌ను గౌర‌విస్తూ పండ‌గ జ‌రిగే రోజుల్లో (అక్టోబ‌రు 9 నుంచి 17 వ‌ర‌కు) గూగుల్ త‌న డూడుల్‌ను బ‌తుక‌మ్మగా పెట్టాల‌ని కోర‌టంలో అర్థం లేద‌న్న మాట వినిపిస్తోంది.

క‌విత వాద‌న‌నే ప్రాతిప‌దిక అయితే.. అన్ని రోజులు గూగుల్ డూడుల్ కానీ బ‌తుక‌మ్మ కాకుంటే.. బ‌తుక‌మ్మ‌ను గౌర‌వించిన‌ట్లు కాదా?  ప్ర‌తి దానికి గౌర‌వం.. ఆత్మాభిమానం అన్న మాట‌ల‌తో తాము కోరుకున్న‌ట్లుగా జ‌ర‌గాల‌నుకోవ‌టం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

తాను మాట్లాడే మాట‌ల‌న్నీ తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే క‌విత లెక్క‌లోకే వెళితే.. కేవ‌లం మూడు కోట్ల మందికి ప‌రిమిత‌మైన బ‌తుక‌మ్మ‌ను మిగిలిన 120 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు ఎందుకు ఓకే చేయాలి. మూడు కోట్ల మంది లెక్క‌ను చూపిస్తూ బ‌తుక‌మ్మ డూడుల్ పెట్టాలంటున్న  క‌విత వాద‌న క‌రెక్ట్ అయితే.. మిగిలిన 120 కోట్ల మంది సంగ‌తి ఏమిటి?  అయినా.. ఒక‌ప్రాంతానికి.. కొంతమంది ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై గూగుల్ డూడుల్ పెట్టేస్తుందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

త‌న రిక్వెస్ట్ కు గౌర‌వం ట్యాగ్ పెట్ట‌టం ఒక ఎత్తు అయితే.. ఒక రోజు కాకుండా బ‌తుక‌మ్మ జ‌రిగిన‌న్ని రోజులు గూగుల్ డూడుల్ అదే ఉండాల‌ని కోర‌టం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. సీఎం కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత రిక్వెస్ట్‌కు గూగుల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News