చంద్రుళ్లు.. కూర్చొని మాట్లాడుకోరే?

Update: 2016-07-05 06:02 GMT
ఇద్దరూ ఇద్దరే అనాలి. రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల తీరు ఒకపట్టాన అర్థం కాదనే చెప్పాలి. ఎవరికి వారు బిగుసుకుపోయినట్లుగా వ్యవహరిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించుకునే విషయంలో ఎవరు చొరవ ప్రదర్శించని వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలా అని ఇద్దరు చంద్రుళ్ల మధ్య ఎలాంటి మాటామంతి అస్సలు లేదా? అంటే అలాంటిదేమీ లేదనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు వచ్చి.. కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు.

దీనికి బదులు అన్నట్లుగా కేసీఆర్ తాను తలపెట్టిన యాగానికి అమరావతికి ప్రత్యేకంగా వెళ్లి.. చంద్రబాబుతో భేటీ అయి.. భోజనం చేసి మరీ వచ్చారు. పిలుపులు ఎంత బాగా పిలుచుకున్నారో.. ఈ రెండు కార్యక్రమాలకు ఇద్దరు చంద్రుళ్లు హాజరై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సంతోషాన్ని మిగిల్చారు. ఇద్దరి మధ్య సత్ సంబంధాల్ని చూసినోళ్లు.. రెండు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీలు దశల వారీగా క్లియర్ అవుతాయని భావించారు.

కానీ.. అలాంటిదేమీ లేని పరిస్థితి. ఫంక్షన్లకు పిలుపులు పిలుచుకునే అధినేతలు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్ని పరిష్కరించుకునే విషయంలో మాత్రం బిర్రబిగుసుకుపోవటం కనిపిస్తుంది. కీలక అంశాల విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాలే వీరిద్దరిని కలిసి కూర్చోకుండా చేస్తున్నాయన్న మాట వినిపిస్తుంది. రాజకీయాలన్నాక పట్టువిడుపులు అవసరం. అదే లేకపోతే ఇరు వర్గాల మధ్య నిత్యం పంచాయితీలే తప్ప.. పాలన మీద మరింత దృష్టి సారించలేరన్న విషయాన్ని ఇద్దరు చంద్రుళ్లు గుర్తిస్తే మంచిది. అదే ఉంటే.. ఇప్పుడీ విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదేమో..?
Tags:    

Similar News