మాల..శాలువా తీసి మరీ వేసి సత్కారం

Update: 2015-09-17 05:13 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం వస్తే ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తారో.. ఆయనకు ఆనందం కలిగినా అంతే. ఇంకా వివరంగా చెప్పాలంటే.. చక్రవర్తి పోలికలు ఆయనలో చాలానే కనిపిస్తాయి. మనసుకు నచ్చిన దాని గురించి పొగిడేయటం.. సత్కరించటం.. నెత్తిన పెట్టుకోవటంలో ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో.. కోపం వస్తే అంతే క్రోధంగా వ్యవహరించటం ఆయనకు మాత్రమే చెల్లే వ్యవహారాలు. జానపద కథనాయకుడి లక్షణాలు తరచూ కనిపించే కేసీఆర్.. అందుకు తగ్గట్లే మరోసారి వ్యవహరించారు.

పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన.. తననకు కలిసేందుకు.. అభినందించేందుకు గంటల కొద్దీ సమయం వేచి ఉన్న నేతలతో కాసేపు గడిపిన ఆయన నేరుగా తన జిగిరీ దోస్త్ మైహోం రామేశ్వరరావు షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు.

ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం.. తనను కలవటానికి విపక్ష నేతలు గంటల సమయం వెయిట్ చేసినా అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు ససేమిరా అనే ఆయన.. తనకు సన్నిహిత మిత్రుడి స్నేహానికి తానెంత ప్రాధాన్యత ఇస్తానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఇక.. ప్రయాణ బడలిక ఏమాత్రం కనిపించని ఆయన.. అద్యంతం ఉల్లాసంగా కనిపించారు.

షష్టి పూర్తి కార్యక్రమం కోసం ప్రముఖ సంగీత వాయిద్యకారుడు శివమణి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన సంగీతంతో పులకించి పోయారు. అనంతరం అందరికి అభివాదం చేసిన శివమణి కేసీఆర్ కు అభివాదం చేశారు. దీంతో పులకరించిపోయిన కేసీఆర్ తన మెడలోని మాలను.. కప్పిన శాలువాను శివమణి మెడలో వేసి సత్కరించారు. తెలుగు రాజకీయ నేతల్లో ఇలాంటివి కేసీఆర్ మాత్రమే చేయగలరేమో.
Tags:    

Similar News