కేసీఆర్ మాస్ట‌ర్ పీస్‌!..ఎస్సీ - ఎస్టీల‌కు ఫ్రీగా రూ.2 ల‌క్ష‌లు!

Update: 2019-03-02 11:08 GMT
టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... సంక్షేమంలో త‌న‌కు సాటి రాగ‌ల వారెవ‌రూ లేర‌న్న రీతిగా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అమ‌లు చేసిన రైతు బంధుతో దేశంలోని అన్ని రాష్ట్రాల‌తో పాటు కేంద్రంలోని అధికార కూట‌మికి ఆద‌ర్శంగా నిలిచారు. రైతు బంధు ప‌థ‌కం కేసీఆర్‌ కు భారీ మైలేజీని తీసుకొచ్చింద‌ని ఈ త‌ర‌హా ప‌రిణామాలే చెబుతున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచాం... ఇచ్చిన హామీల‌ను అట‌కెక్కించినా ఇబ్బంది లేద‌న్న ఫ‌క్తు పొలిటీషియ‌న్ మెంటాలిటీకి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌... ఇప్పుడు త‌న సంక్షేమ పాల‌న‌లోనే మాస్ట‌ర్ పీస్‌ గా ప‌రిగ‌ణించే స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఆగ‌స్టు నుంచి అమ‌ల్లోకి తేవాల‌ని కేసీఆర్ భావిస్తున్న ఈ ప‌థ‌కం... ఎస్సీ, ఎస్టీల స‌మ‌గ్రాభివృద్ధికి దోహదం చేయ‌నుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇప్ప‌టికే విధివిధానాలు కూడా రెడీ అయిపోయిన‌ ఈ ప‌థ‌కం కింద ఎస్సీ - ఎస్టీల కుటుంబాల‌కు ఒక్కో దానికి రూ.2ల‌క్ష‌లు అంద‌నున్నాయి. న‌గ‌దు రూపంలో అందే ఈ మొత్తంలో ల‌బ్ధిదారులు సింగిల్ పైసా కూడా తిరిగి చెల్లించాల్సిన ప‌ని లేదు. అంటే... ఈ మొత్తం ఆయా కుటుంబాల‌కు ఫ్రీగానే అంద‌జేస్తార‌న్న మాట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల సంద‌ర్భంగానే ఈ ప‌థ‌కంపై ఆలోచించిన కేసీఆర్‌... స‌మ‌యాభావం వ‌ల్ల దానిపై పూర్తి క్లారిటీ రాని నేప‌థ్యంలో ప్ర‌క‌టించ‌లేద‌ట‌. ఇక మొన్న అసెంబ్లీ ముందుకు వ‌చ్చిన ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ లో దీనిని ప్ర‌క‌టించినా... భారీ ఎత్తున నిధులు అవస‌రమ‌య్యే ఈ ప‌థ‌కానికి నిధుల ఇబ్బంది వ‌స్తుంద‌న్న భావ‌న‌తోనే ఆగార‌ట‌. అయితే ఆగ‌స్టులో పూర్తి స్థాయి బ‌డ్జెట్ రానుండ‌గా... అందులో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పాటుగా ఏకంగా నిధుల‌ను కూడా కేటాయించ‌నున్నార‌ట‌.

ఈ ప‌థ‌కం నేప‌థ్యం విషయానికి వస్తే... ఎన్నిక‌ల‌కు ముందు గొల్ల కురుమ‌ల‌కు గొర్రెల పంపిణీ కింద ఒక్కో యూనిట్ కు ప్రభుత్వం రూ.1.25 లక్షల‌ను అందజేస్తోంది. 20 గొర్రెలు - ఒక పొట్టేలును పంపిణీ చేస్తోంది. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుండగా - మిగతా 25 శాతం లబ్ధిదారు సమకూర్చు కోవాల్సి ఉంటుంది. గొల్లకురుమలకు లబ్ధి కలిగిస్తున్నట్టుగానే ఇప్పుడు ఈ కొత్త ప‌థ‌కంలో ఎస్సీ - ఎస్టీ కుటుంబాలకు ప్ర‌త్య‌క్షంగా రూ.2 ల‌క్ష‌ల‌ను సాయంగా అందించాల‌ని కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు రూ.15 వేల కోట్లు - ఎస్టీలకు రూ.6 వేల కోట్ల‌ను వెచ్చించ‌నుంద‌ట‌.

పాడి పశువులు - మేకలు - గొర్రెలు - కోళ్లు - కుటీర పరిశ్రమలు - భూమి అభివృద్ధి - కొత్త వ్యాపారం ప్రారంభించడం - ఇప్పటికే ఉన్న వ్యాపారం విస్తరణకు ఈ సాయాన్ని ఉపయోగించుకునేలా ఎస్సీ - ఎస్టీల‌ను ప్రోత్స‌హించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం విధివిధానాల‌ను రూపొందించేందుకు క‌డియం శ్రీ‌హ‌రి నేతృత్వంలో ఓ క‌మిటీని వేయ‌గా... స‌ద‌రు క‌మిటీ ప‌లు సిఫార‌సుల‌తో ప్ర‌భుత్వానికి నివేదిక కూడా స‌మ‌ర్పించింద‌ట‌. మొత్తంగా త‌న సంక్షేమ పాల‌న‌కే మాస్ట‌ర్ పీస్‌ గా కేసీఆర్ ఈ ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌స్తే... ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌న్ని టీఆర్ఎస్ వెంట న‌డ‌వడం గ్యారెంటీ అని, విప‌క్షాల‌కు ఇక అధికారం క‌ల్లేన‌న్న వాదన వినిపిస్తోంది.

   

Tags:    

Similar News