250 కార్ల భారీ కాన్వాయ్ అవసరమంటారా కేసీఆర్?

Update: 2023-06-26 12:11 GMT
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే భారీ సినిమాకు పెద్ద ఎత్తున ఖర్చు చేయటం.. గ్రాండ్ నెస్ కోసం కోట్లాది రూపాయిల్ని పట్టించుకోకుండా ఖర్చు చేయటం చేస్తుంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అదే భారీతనాన్ని నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పేరును పెట్టేసిన నాటి నుంచి భారీగా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. జాతీయ స్థాయిలో దేశం మొత్తాన్ని తన గులాబీ పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్.. తొలుత తన టార్గెట్ గా మహారాష్ట్రను పెట్టుకోవటం తెలిసిందే.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సరిహద్దుల్ని కలుపుకొని ఉన్న మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో.. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతల్ని పార్టీలో చేర్చుకోవటం.. భారీ ఎత్తున ప్యాకేజీలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన మీడియా సంస్థలకు కోట్లాది రూపాయిల ప్రకటనలతోవారిని ఆనందానికి గురి చేస్తున్న కేసీఆర్.. తాజాగా మహారాష్ట్రలోని రాజకీయ నేతలకు తన భారీతనాన్ని పరిచయం చేస్తున్నారు.

పార్టీని విస్తరించేందుకుఅవసరమైన టక్కు టమారా విద్యలు కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఈ విషయాన్ని మహా ఎన్నికల్లోనూ నిరూపించారు కేసీఆర్. గడిచిన కొన్ని నెలలుగా మహారాష్ట్రలో స్పెషల్ ఫోకస్ చేయటమే కాదు.. అక్కడి నేతల్ని తెలంగాణకు తీసుకొచ్చి.. వారి మనసు దోచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరాఠా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 15నప నాగపూర్ లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన ఎత్తులతో తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి స్థానిక ఎన్నికలు.. మార్కెట్ కమిటీ ఎన్నికల మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. ఆయన కోరుకున్నట్లే తాజాగా ఒక సానుకూల ఫలితం నమోదైంది. శనివారం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్ లోని సావ్ ఖేడా గ్రామ పంచాయితీ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం కావటం.. గులాబీనేతల్లో ఆనందానికి హద్దే లేకుండా పోయిందంటున్నారు.

తాజా ఎన్నికలో గెలుపు.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రస్థానానికి తొలి మెట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆయన పక్కా షెడ్యూల్ సిద్దమైంది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలతో ఏకంగా 250 కార్ల కాన్వాయ్ తో మహారాష్ట్రలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంత భారీతనం మరాఠా రాజకీయాలకు పెద్దగా పరిచయం లేదు. అందరి కన్ను తన మీద పడేలా చేయటం కోసమే ఇంత గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహిస్తున్నారని చెప్పాలి.

అయితే.. ఇంత భారీ ఖర్చు అవసరమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. భారీతనం తప్పేం కాదు కానీ.. 250 కార్ల కాన్వాయ్ భారీతనంతో పాజిటివ్ కంటే నెగిటివ్ గా మారుతుందని.. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు. అందులోనూ తెలంగాణతో పోలిస్తే మరాఠీలకు ప్రాంతీయ భావన ఎక్కువ. కేసీఆర్ హడావుడి ఎంత ఎక్కువగా చేస్తే.. రానున్న రోజుల్లో అంతే ఎక్కువగా సమాధానం చెప్పేందుకు భావోద్వేగాల్ని స్ప్రశిస్తే.. కొత్త తలనొప్పులు ఖాయమంటున్నారు.

ఆర్భాటం.. హడావుడి మోతాదు మించేలా చేస్తున్న కేసీఆర్ తీరుతో కోట్లాది రూపాయిలు మంచినీళ్ల మాదిరి ఖర్చు చేస్తున్న ధోరణి.. అంతిమంగా తెలంగాణ మీద పడటం ఖాయమంటున్నారు. కాస్త చూసి ఖర్చు చేయ్ కేసీఆర్ అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తాజా టూర్ లో రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న గులాబీ బాస్.. మరెన్ని సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.

Similar News