60వేల ఫ్యామిలీల‌కు కేసీఆర్ దేవుడు కానున్నారు

Update: 2017-09-17 04:30 GMT
గురి చూసి కొట్ట‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసినా.. అలాంటి భావ‌న క‌ల‌గ‌కుండా చేయ‌టంలో ఆయ‌నకు మాత్ర‌మే సాధ్యం. చేసే దానికి చెప్పే దానికి సంబంధం లేకున్నా.. అలాంటి ఫీలింగ్ ద‌రి చేర‌కుండా చేసే కేసీఆర్ తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఈసారి ఆఫ‌ర్ ఎంబీసీ(అత్యంత వెనుక‌బ‌డిన కులాలు) ల‌కు మాత్ర‌మే.

రాష్ట్రంలో బీసీల కుల‌వృత్తుల ప్రోత్సాహానికి.. ప్ర‌త్యామ్నాయ ఉపాధికి బ్యాంకుల‌తో సంబంధం లేకుండా ఎంబీసీ కార్పొరేష‌న్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించాల‌ని కేసీఆర్ డిసైడ్ కావ‌ట‌మే కాదు.. అలా చేయ‌లంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.ల‌క్ష నుంచి రూ.2ల‌క్ష‌ల మేర సాయం చేయాల‌ని పేర్కొన్నారు.

కులాల వారీగా ప్ర‌త్యేక ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌న్న కేసీఆర్‌.. ఏటా 60 వేల నుంచి 70వేల ఫ్యామిలీల్ని ఆదుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.వెయ్యికోట్లు కేటాయించామ‌ని.. వ‌చ్చే ఏడాదికి ఈ మొత్తాన్ని మ‌రింత‌గా పెంచ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. బీసీ కుటుంబాల‌కు వ్య‌క్తిగ‌తంగా సాయాన్ని అందించేందుకు వీలుగా ప్రోగ్రామ్‌ను రూపొందించి.. అక్టోబ‌రును నుంచి అమ‌లు చేయాల‌న్నారు.  

తాజాగా నిర్వ‌హించిన స‌మీక్ష‌లో.. ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు తావు లేకుండా సాయాన్ని అందించాల‌న్న ఆకాంక్ష‌ను కేసీఆర్ వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. వాస్త‌వం ఏమిటో అంద‌రికి తెలిసిందే. ఏడాదికి 60-70వేల కుటుంబాల ల‌క్ష్యం అన్న వెంట‌నే జ‌రిగేదేమిట‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా ఎంబీసీల‌కు అండ‌గా మారే ఈ ప‌థ‌కం పుణ్య‌మా అని వారి ఆర్థిక ప‌రిస్థితి మార‌టంతో పాటు.. వారి ఇళ్ల‌ల్లో కేసీఆర్ కొత్త ఇల‌వేల్పు అవుతార‌న‌టంలో సందేహం లేదు.

త‌మ మాదిరి దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో బీసీకులాల‌కు అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. కుల‌వృత్తుల ఆధారంగా చేయూత‌ను ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పారు. వివిధ కుల‌వృత్తుల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వాల ఆధారంగా తెలంగాణ‌లో చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు ఉండాల‌న్న కేసీఆర్‌.. ఇప్ప‌టికే కులాల వారీగా చేప‌ట్టిన ప‌థ‌కాల్ని ప్ర‌స్తావించారు.

గొల్ల కుర‌మ‌ల కోసం రూ.4వేల కోట్ల‌తో గొర్రెల పంపిణీ.. మ‌త్స్య‌కారుల కోసం రూ.వెయ్యి కోట్ల‌తో చేప‌ల పెంప‌కం.. రూ.1200  కోట్ల‌తో నేత కార్మికుల‌కు ప్ర‌త్యేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. వీరే కాక రానున్న రోజుల్లో గీత‌.. ర‌జ‌కులు.. నాయి బ్రాహ్మ‌ణులు..కుమ్మ‌రులు.. పంచ‌క‌ర్మ‌ల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్ని రూపొందించ‌నున్న‌ట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. మొత్తానికి వేలాది కుటుంబాల‌కు వ్యూహాత్మ‌కంగా ఎంబీసీల ఇళ్ల‌ల్లో స‌రికొత్త ఇల‌వేల్పు కానున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News