నాలుగు కోట్ల మంది ఆత్మ‌గౌరవం.. : నూత‌న స‌చివాల‌య వేళ కేసీఆర్ వ్యాఖ్య‌లు

Update: 2023-04-30 17:08 GMT
``రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చేలా... ఆత్మగౌరవ ప్రతీకగా... సంప్రదాయం, ఆధునికత, సాంకేతికత మేళవింపుగా.. ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించింది.`` అని సీఎం కేసీఆర్ అన్నారు.  రికార్డు సమయంలో పూర్తి చేసుకుని రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తోంద‌ని తెలిపారు.  సమీకృత సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

మ‌ధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాల నుంచి ఒంటి గంటా 32 నిమిషాల మధ్య సచివాలయ ప్రారంభ కార్యక్రమం పూర్తి అయింది. నిర్ణీత ముహూర్తమైన ఒంటి గంటా 20 నిమిషాలకు సీఎం కేసీఆర్ సచివాలయం చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. రహదార్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు ఆయనకు స్వాగతం పలికారు.

వేదపండితుల ఆశీర్వచనం మధ్య సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్: అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ యాగశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భవన ప్రధాన ద్వారం ఎదురుగా పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఆ తర్వాత గ్రాండ్ ఎంట్రీ వద్ద ఫలకాన్ని ఆవిష్కరించి.. నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కింది అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి వెళ్లి అక్కడ వాస్తుపూజలో పాల్గొన్నారు.

ఆ తర్వాత నేరుగా తన కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఛాంబర్లో పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు. వెంటనే ముఖ్యమైన ఆరు దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం ఒంటి గంటా 32 నిమిషాలలోపు పూర్తి అయింది. ఆ తర్వాత మండలి ఛైర్మన్, శాసనసభాపతి, మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అభినందించారు.

Similar News