దేశంలో డ్రామా పాలిటిక్స్ జ‌రుగుతున్నాయ్‌: కేసీఆర్ హాట్ కామెంట్స్‌

Update: 2023-03-23 15:43 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో డ్రామా పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌న్నారు. త‌న‌కు న‌చ్చ‌ని, తాను మెచ్చ‌ని ప్ర‌భుత్వాల‌ను కేంద్రంలోని బీజేపీ ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంద ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు. దేశంలో వ్యవసాయానికి లాభం చేకూర్చే పాలసీలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయం దండగనే మూర్ఖులు కేంద్రంలో పాల‌న సాగిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

తాజాగా  సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. బోనకల్‌ మండలంలోని రామపురంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పుడు డ్రామా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.  

'కేంద్రానికి రాజకీయాలు తప్పితే రైతుల మీద ప్రేమ లేదు. కేంద్రానికి ఏం చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. పంట నష్టపరిహారంపై కేంద్రానికి నివేదికలు పంపవలసిన అవసరం లేదు.

గతంలో పంపిన పరిహారమే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు పంపాల్సిన అవసరమే లేదు' అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రానికి ఓటు బ్యాంకు రాజ‌కీయాలు త‌ప్ప‌.. ప్ర‌జా రాజ‌కీయాలు చేయ‌డం చేత‌కాద‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షానే నిలుస్తుంద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు..  దేశ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు.

Similar News