ప్రాక్టిక‌ల్ గా మాట్లాడుతూనే..అదే ఓవ‌ర్ కాన్పిడెన్స్?

Update: 2018-10-22 05:11 GMT
సాధార‌ణంగా ఓవ‌ర్‌ కాన్ఫిడెన్స్ తో ఉన్న వారు.. ప్రాక్టిక‌ల్ గా జ‌రిగే అంశాల్ని ప‌ట్టించుకోరు. కంటికి క‌నిపించే వాస్త‌వాల్ని గుర్తించ‌కుండా ఊహాలోకాల్లో బ‌తుకుతూ.. త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తుంటారు. ఇందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యంపై కేసీఆర్ ఇప్ప‌టికి కాన్ఫిడెన్స్ గా ఉండ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌లేం. అధినేత‌గా ఆయ‌నలో అంత న‌మ్మ‌కం లేకుంటే.. పార్టీ మొత్తం డీలా ప‌డే ప్ర‌మాదం ఉంది.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. తాజా ఎన్నిక‌లు టీఆర్ ఎస్ కు ఎంత‌మాత్రం సులువు కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న గులాబీ గుర్రాలు చెమ‌ట‌లు చిందేలా ప‌రుగులు పెడితే త‌ప్పితే.. విజ‌యం సాధ్యం కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇలాంటివేళ‌లో కేసీఆర్ చెబుతున్న మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఒక‌వైపు ప‌క్కా ప్రాక్టిక‌ల్ గా ఉన్న‌ట్లు క‌నిపిస్తూనే.. మ‌రోవైపు అతిశ‌యం మాట‌లు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుండ‌టం విశేషంగా చెప్పాలి. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో గెలుపు మీద మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో పార్టీ నేత‌లు చేసిన త‌ప్పుల కార‌ణంగా జ‌గ‌న్ పార్టీ ఓట‌మి చెందిన‌ట్లుగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్‌. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌టం ద్వారా.. తాను ఊహాలోకాల్లో ప‌య‌నించ‌టం లేద‌ని.. చాలా ప్రాక్టిక‌ల్ గా ఉన్న‌ట్లుగా సందేశాన్ని ఇచ్చారు.

మ‌రింత ప్రాక్టిక‌ల్ గా ఉన్న‌ట్లు క‌నిపించిన కేసీఆర్‌.. మ‌రోవైపు వంద‌కు ఏ మాత్రం సీట్లు త‌గ్గే ఛాన్సే లేద‌ని చెబుతున్నారు. అసెంబ్లీ ర‌ద్దు స‌మ‌యంలో తెలంగాణ‌లో ఉన్న వాతావ‌ర‌ణానికి.. తాజాగా నెల‌కొన్న వాతావ‌ర‌ణానికి ఎక్క‌డా పోలిక లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి వేళ‌లోనూ వంద సీట్ల కాన్ఫిడెన్స్ ను కేసీఆర్ ప్ర‌ద‌ర్శించ‌టంలో అర్థం లేద‌న్న మాట వినిపిస్తూనే ఉంది. ఎవ‌రైనా ప్రాక్టిక‌ల్ గా ఉన్నారంటే వారెంతో జాగ్ర‌త్త‌గా ఉన్న‌ట్లుగా చెప్పాలి. మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటూనే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాట‌ల్ని చెబుతున్న కేసీఆర్ తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News