మోడీని కేసీఆర్ ఎలా డీల్ చేసి ఉంటారు?

Update: 2018-08-28 05:18 GMT
సైద్ధాంతికంగా ఉత్త‌ర ద‌క్షిణ ధ్రువాలుగా క‌నిపించే ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల మ‌ధ్య స్నేహం చిగురించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఒక‌ర‌కంగా మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య స్నేహం జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో విచిత్ర‌మైన ప‌రిణామం చెప్ప‌క త‌ప్ప‌దు. వాస్త‌వానికి మోడీకి.. కేసీఆర్ కు మ‌ధ్య పోలిక‌లు చాలానే కనిపిస్తాయి. ఇద్ద‌రూ మాట‌ల‌తో ఎదుటి వారిని మంత్రుముగ్దుల్ని చేయ‌టంలో ఆరితేరిన వారే.

ఇరువురు నోరు క‌ట్టేసుకున్న‌ట్లుగా కనిపిస్తూనే.. జ‌ర‌గాల్సిన వ్య‌వ‌హారాలు జ‌రిపించేస్తుంటార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు. విచిత్రంగా మీడియాను డీల్ చేసే విష‌యంలో ఇరువురి మైండ్ సెట్ ఒకేలా ఉండ‌ట‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థుల విష‌యంలోనూ ఇరువురిది ఒకే స్కూల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టంలో ఆరితేరి ఇరువురు నేత‌ల మ‌ధ్య సాగిన డీల్ ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. స్ప‌ష్ట‌మైన ఎజెండా పెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాను అనుకున్న‌ది సాధించుకొని వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ముంద‌స్తుకు వెళ్లేందుకు ప్ర‌ధాని మోడీని క‌న్వీన్స్ చేయ‌టంలో కేసీఆర్ విజ‌యం సాధించ‌ట‌మే కాదు.. త‌న‌కు కొన్ని తాయిలాలు కావాల‌ని చెప్ప‌ట‌మే కాదు.. చిట్టా విప్పి మ‌రీ ప‌ని పూర్తి చేయించుకురావ‌టం క‌నిపిస్తుంది.

ఇంత‌కీ.. మోడీని కేసీఆర్ ఎలా క‌న్వీన్స్ చేసి ఉంటారు. త‌న‌కేమాత్రం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేని విష‌యాల్లో ఒక ప‌ట్టాన త‌గ్గ‌ని మోడీకి ఏం చెప్పి కేసీఆర్ ఒప్పించి ఉంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తాను ముంద‌స్తుకు వెళ్లిన ప‌క్షంలో త‌న‌కు మాత్ర‌మే కాదు.. బీజేపీకి ఎలాంటి ప్రయోజ‌నం క‌లుగుతుందో కేసీఆర్ వివ‌రించి చెప్ప‌టంలో సక్సెస్ అయ్యార‌న్న‌మాట వినిపిస్తోంది. ఆయ‌న కొన్ని విష‌యాల్ని స్ప‌ష్టంగా వివ‌రించ‌ట‌మే కాదు.. లాజిక్ గా ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

మోడీ క‌న్వీన్స్ అయ్యేలా  కేసీఆర్ ఏం చెప్పి ఉంటార‌న్న విష‌యానికి వ‌స్తే.

1. ముంద‌స్తుకు వెళ్ల‌టం ద్వారా టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ముంద‌స్తుకు స‌హ‌క‌రించుకున్న దానికి ప్ర‌తిగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత మోడీ స‌ర్కారుకు పూర్తి స్థాయి మద్ద‌తు ప్ర‌క‌టించ‌టం.

2. ముంద‌స్తు కార‌ణంగా తెలంగాణ‌లో బీజేపీకి ఒరిగే ప్ర‌యోజ‌నం శూన్యం. అయితే.. అంత‌కు మించి అన్న‌ట్లుగా క‌లిగే లాభం ఏమంటే. ముంద‌స్తు జ‌రిగే వేళ‌.. తెలంగాణ‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్తాన్.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరం రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మొద‌టి మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వాలు ఉన్నాయి. ఈ మూడు చోట్ల బీజేపీ ఓడిపోయే ప్ర‌మాదం ఉంది. అదే జ‌రిగితే.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప‌క్కాగా విజ‌యం సాధిస్తుంది. అలాంటివేళ‌.. మోడీ ఛ‌రిష్మా త‌గ్గింద‌న్న దాని కంటే.. స్థానిక ప్ర‌భుత్వాల మీద ఉన్న వ్య‌తిరేక ఓటే ఓడించింద‌న్న మాట‌ను చెప్ప‌టానికి.. కాంగ్రెస్ బ‌లం పుంజుకోలేద‌న్న‌ది చెప్ప‌టానికి తెలంగాణ ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

3. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓట‌మి ద్వారా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇప్ప‌టికి కోలుకోలేద‌ని.. తెలంగాణ‌ను ఇచ్చిన పార్టీగా కూడా అక్క‌డి ప్ర‌జ‌లు గుర్తించ‌లేదంటే.. ఆ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఎంత విశ్వాసం ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌న్న విష‌యాన్నిచెప్ప‌టం ద్వారా.. మోడీ ఇమేజ్ కు ఎలాంటి డ్యామేజ్ జ‌ర‌గ‌లేద‌న్నది స్ప‌ష్టం చేసే వీలు ఉంటుంది.

4. ముంద‌స్తుకు ఓకే అన‌టం ద్వారా కొత్త మిత్రుల్ని స‌మ‌కూర్చుకోవ‌టంలో మోడీ విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంది. గ‌త సార్వ‌త్రికంలో మిత్రులుగా ఉన్న వారుచాలామంది కూటమి నుంచి వెళ్లి పోయిన నేప‌థ్యంలో..  వ‌చ్చే సార్వ‌త్రికం నాటికి కొత్త మిత్రుల‌ను స‌మ‌కూర్చుకునే విష‌యంలో మోడీ విజ‌యం సాధించార‌న్న అభిప్రాయాన్ని క‌లిగించ‌టం.


Tags:    

Similar News