కేసీఆర్ అనుకున్నట్లు జరిగితే ‘గుద్దుడే గుద్దుడు’

Update: 2016-10-17 05:16 GMT
వ్యూహాల్ని సిద్ధం చేయటం ఎంత ముఖ్యమో.. వాటిని అమలు చేయటం అంతే కీలకం. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండు విషయాల్లోనూ మహా నేర్పరి. ఒకటి తర్వాత ఒకటిగా చేసుకుంటూ పోతున్నట్లు కనిపించినా.. ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న పనుల్ని చూస్తే.. ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం 2019 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలోపెట్టుకొని మాత్రమేనన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి అయి.. కేవలం రెండు సంవత్సరాల స్వల్ప వ్యవధి  (చివరి ఆర్నెల్లు ఎన్నికల హడావుడి వచ్చేస్తుంది కాబట్టి ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోలేదు) మాత్రమే మిగిలిన నేపథ్యంలో.. అప్పటికి అవసరమైన గ్రౌండ్ ను ఇప్పుడే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు తగ్గట్లే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కావొచ్చు.. మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ.. కొత్త జిల్లాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ఆయన దూరదృష్టి.. ఓటుబ్యాంకు రాజకీయం కనిపిస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన చేసే పనుల్నీ ఎంతో విజన్ తో చేస్తున్నట్లు కనిపించటం. కానీ.. నిశితంగా చూసినప్పుడే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తామని.. ఆ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా తాము ఓట్లు అడగనే అడగమన్న విషయాన్ని కేసీఆర్ పదే పదే చెప్పటం తెలిసిందే. అయితే.. ఇప్పటివరకూ మిషన్ భగీరథ ప‌థకం జరిగింది చాలా తక్కువన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అయ్యే ఈ కీలక పథకంపై కేసీఆర్ దృష్టి సారించారు.

కొత్త జిల్లాల సందడి ముగిసిన వేళ ఆదివారం ఆయన మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా రెండు కీలక అంశాల్ని ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అందులో ఒకటి.. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడల నుంచే మొదలుపెట్టాలన్నది ఒకటైతే.. ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2017 డిసెంబరు నాటికి పూర్తి చేయాల‌న్న‌ది రెండోది. అంటే.. మరో 14 నెలలు మాత్రమేనన్న మాట. ఈ రెండు అంశాల్ని చూస్తే.. అర్థమయ్యేది ఒక్కటే. డెడ్ లైన్ ను ఎన్నికలకు దాదాపు 17 నెలల ముందే నిర్ణయించిన పక్షంలో.. ఒకవేళ తేడా వచ్చినా కనీసం 12 నెలల్లో విషయాన్ని ఒక కొలిక్కి తీసుకు రావొచ్చు. అంటే..ఏది ఏమైనా 2019 మార్చికంటే ముందే.. మిషన్ భగీరథ ఫలాల్ని రాష్ట్ర ప్రజలు అందుకోవాలని.. ఆ తర్వాత అందుకు తగ్గ ఫలితాలు తాము సొంతం చేసుకోవాలన్నది కేసీఆర్ ప్లాన్ గా చెప్పొచ్చు.

ఇక.. మిషన్ భగీరథ ను గ్రామాల్లోని దళిత కుటుంబాలకు ముందుగా ఇవ్వాలని డిసైడ్ చేయటం ద్వారా తన రాజకీయ వ్యూహ చతురత ఎంతన్నది కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. నల్లా నీళ్ల కోసం నిత్యం ఎన్నో సమస్యలకు గురయ్యే దళిత వాడలకు కానీ తొలుత నల్లా నీళ్లను రప్పించగలిగితే.. తెలంగాణ రాష్ట్రంలోని దళిత వాడలు మరో ఆలోచన లేకుండా తెలంగాణ అధికారపక్షానికి ఓట్లు గుద్దేస్తారనటంలో మరెలాంటి సందేహానికి తావులేవు. తమ గురించి మాట్లాడే నేతల్ని మాత్రమే చూసే దళిత వాడలు.. తమ విషయాన్ని చేతల్లో చేసి చూపించిన కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవటానికి ఏ మాత్రం వెనుకాడవని చెప్పాలి. అదే జరిగితే.. ఒక భారీ ఓటుబ్యాంకు తెలంగాణ అధికారపక్షం అకౌంట్లోకి చేరుతుందనటంలో సందేహం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. తన తాజా లక్ష్యాన్ని తనదైన శైలిలో అధికారుల ముందు పెట్టటమే కాదు.. వాటిని పూర్తి చేయాలన్న ఆదేశాలు ఇచ్చారు. చతురత ఉన్న రాజకీయ అధినేతకు సాధ్యం కానిది ఏముంటుంది? అందులోనూ అధికారం సైతం ఆయనతోనే ఉంటే అలాంటి అధినేతను అడ్డుకునే వారు ఎవరుంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News