నాన్ స్టాప్ కరెంటుకు ‘కేసీఆర్’ అంత కట్టనున్నారు

Update: 2016-06-27 05:50 GMT
రాష్ట్ర విభజనకు ముందు కొన్ని అంచనాలు.. మరికొన్ని భయాలు భారీగా వినిపించేవి. అందులో ఒకటి.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొంటుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పక్షంలో విద్యుత్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని.. విద్యుత్ కోతలతో ఆ రాష్ట్రం విలవిలాడుతుందని హెచ్చరించే వారు.కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందన్న వాదనలు వినిపించాయి.

అయితే.. అందుకు భిన్నంగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మేజిక్ నే చేశారు. కరెంటు కోతల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయటమే కాదు.. నాన్ స్టాప్ గా కరెంటు ఉండేలా చేశారు. చివరకు వేసవిలోనూ కోతల్లేకుండా చేసి.. అందరూ అవాక్కు అయ్యేలా చేశారు. ఎలా చేశారు? ఏం చేశారన్న విషయంపై చాలామంది చాలానే చెబుతున్నా.. కరెంటు కష్టాలు తెలంగాణ ప్రజలకు లేకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొనటంతో పాటు.. నానా తిప్పలు పడిన తెలంగాణ ప్రభుత్వం కరెంటు కోతల వాతలు తెలంగాణ ప్రజల మీద పడకుండా చేశారని చెప్పాలి. అయితే.. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టారన్న విషయం తాజా ఉదంతం ఒకటి స్పష్టం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ పంపిణీ బయట మార్కెట్లో విద్యుత్ కొనేందుకు గత రెండేళ్లుగా భారీగా ఖర్చు చేసినట్లుగా తేలింది.  దాదాపు రూ.4వేల కోట్ల వరకూ విద్యుత్ కొనుగోలు మీద ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే.. ఈ మొత్తాన్ని కేంద్రం స్టార్ట్ చేసిన ఉదయ్ పథకంలో చేర్చటం ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఆలోచనను కేంద్రం కొట్టిపారేసిందన్నది తాజా కబర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2016 మార్చి వరకూ విద్యుత్ కొనుగోలు కోసం ఖర్చు చేసిన రూ.4వేల కోట్లను అప్పులుగా ఉదయ్ లో చూపించాలని తెలంగాణ అధికారులు భావిస్తే.. అలాంటిది కుదరదని తాజాగా కేంద్రం తేల్చి చెప్పింది.  విభజన తర్వాత చేసిన రూ.4వేల కోట్ల అప్పులకు తోడు.. అంతకు ముందువి మరో రూ.12వేల కోట్లు ఉన్నాయని.. ఆ మొత్తాన్ని ఉదయ్ పథకంలోకి తీసుకెళ్లి.. రూ.4వేల కోట్లను మాత్రం తెలంగాణ ప్రభుత్వమే భరించాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఉదయ్ పథకంలో చేరితే.. ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున ఛార్జీలను సవరించాలన్న నిబంధన ఉంది. మరి.. ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా? అన్నది ఒక ప్రశ్నగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఉదయ్ లో చేరితే తెలంగాణ సర్కారు కొనుగోలు చేసిన విద్యుత్ బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీదనే పడనుందనటం ఖాయం. అంటే.. ఇప్పుడున్న ఖర్చులకు మరో రూ.4వేల కోట్లు అదనంగా జత కలిసినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News