ఫామ్ హౌస్ నుంచి ప్రగతిభవన్ కు రానున్న కేసీఆర్.. కారణమిదే..

Update: 2020-06-08 05:15 GMT
గడిచిన కొద్ది రోజులుగా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు రానున్నారు. ఈ రోజు ఉదయానికి హైదరాబాద్ రానున్న ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు కీలక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దశల వారీగా లాక్ డౌన్ ను సడలిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటు.. మరణాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందిగా మారింది.

లాక్ డౌన్ వేళలో.. పరిమితంగా ఉన్న పాజిటివ్ నమోదు.. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. కేసుల కట్టడి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది ఎజెండాగా చెబుతున్నారు. ఈ సమీక్షకు ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ తో పాటు వైద్యశాఖకు చెందిన ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీకి చెందిన ముఖ్యులు కూడా సమీక్షలో పాల్గొననున్నారు.

మరో సమీక్షలో పదో తరగతి పరీక్షల పైన కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రమంతా పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న విషయం మీద కీలక సమీక్ష జరగనుంది. ఈ రివ్యూకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యా శాఖ కీలక అధికారులు పాల్గొననున్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సాగే బ్యాక్ టు బ్యాక్ సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలు ఏమిటన్నది సాయంత్రం ఏడు గంటల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇటీవల కాలంలో మీడియా ప్రతినిధులు పలువురు మహమ్మారి బాధితులుగా మారుతున్న వైనంపైనా ప్రభుత్వం స్పందించే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News