స్పీకర్ విషయంలో కేసీఆర్ క్లారిటీ..

Update: 2019-01-15 06:36 GMT
తెలంగాణలో కేబినెట్ ఏర్పాటు ఎప్పుడు.? ఇప్పుడీ ప్రశ్న తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు హోంమంత్రిగా మహమూద్ అలీ కూడా ప్రమాణం చేశారు. వీరిద్దరూ తప్పితే ఇంతవరకూ మంత్రివర్గ ఏర్పాటు కాలేదు. నెల దాటుతున్నా చడీ చప్పుడూ లేదు. కేసీఆర్ ను మంత్రివర్గ విస్తరణ చేయమని అడిగే ధైర్యం ఇటు స్వపక్షానికి.. అటు కుదేలైన విపక్షానికి లేకుండా పోయింది. అసలు ఆయన ఎందుకు జాప్యం చేస్తున్నాడన్నది కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు.

అయితే తాజాగా ఎనిమిది మందితో కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో ఈనెల 30వరకు  మంత్రివర్గం ఏర్పాటుపై ఆశలు వదులుకోవాల్సిందే.. అయితే మంత్రి వర్గం ఏర్పాటుకు ముందు అసెంబ్లీ సమావేశమవ్వాలి.. అంతకుముందు స్పీకర్ గా ఎవరో ఒకరు నియామకం అవ్వాలి. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ తతంగమంతా జరగాలంటే ముందు స్పీకర్ ఓకే అవ్వాలి. అందుకే ఇప్పుడు కేసీఆర్ సంక్రాంతి తర్వాత ముందుగా చేసే స్పీకర్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారట..

అయితే స్పీకర్ ఎంపిక విషయంలో కేసీఆర్ చాలా సామాజిక  సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నాడని సమాచారం. కేసీఆర్ ఆలోచనలో ఈటల రాజేందర్, రేఖానాయక్, పద్మా దేవేందర్ రెడ్డి  - పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ రేసులో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.. వీరితోనే స్పీకర్ పదవి చేపట్టాలని మాట్లాడినట్టు తెలిసింది.

కేసీఆర్ అంతరగింకుల నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం.. ఈ నలుగురిలో ఒకరికి స్పీకర్ పదవి లభించవచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.  అయితే ఈటల స్పీకర్ పదవికి ఆసక్తి లేకపోవడంతో పోచారం, పద్మా దేవందర్ రెడ్డి లలో ఎవరో ఒకరిని స్పీకర్ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. దీన్ని బట్టి రెడ్డి సామాజికవర్గానికే స్పీకర్ పదవి లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
   

Tags:    

Similar News