నాన్ వెజ్ ప్రియులకు.. కేసీఆర్ తరహా గుడ్ న్యూస్..!

Update: 2023-02-02 11:20 GMT
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం.. ఆహారానికి సంబంధించిన విషయాలపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు సైతం ప్రజలకు శుచికరమైన ఆహారాన్ని అందించేందుకు కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిది ముద్ద దిగని వారు ఎంతో మంది ఉన్నారు. ఏపీ.. తెలంగాణలో రోజురోజుకు శాఖాహారుల సంఖ్య తగ్గుతుండగా మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతోంది.

ఈ మేరకు ఏపీలో ఇప్పటికే ఫిష్ మార్టులు.. మటన్ మార్ట్ వంటి పథకాలు నడుస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితమే ఏపీలో మటన్ మర్ట్ లకు శ్రీకారం చుట్టారు. తక్కువ ధరలో నాణ్యమైన మాంసం ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుండటంతో వీటిలోనే మటన్ కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ స్కీమ్ పై ప్రతిపక్షాలు ఓ రేంజులో ఫైర్ అవుతున్నా ప్రభుత్వం మాత్రం లెక్క చేయకుండా ముందుకెళుతోంది. అయితే ప్రజల నుంచి ఈ మటన్.. ఫిష్ మర్టులకు మంచి ఆదరణ లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ ఈ తరహా పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. కేసీఆర్ పుట్టిన రోజునే ఈ కొత్త స్కీమ్ అమల్లోకి రానుండటం గమనార్హం.

ప్రజలకు ఆరోగ్యకరమైన మటన్ అందించడంతోపాటు మటన్ విక్రమయాలను తెలంగాణలో పెంచే లక్ష్యంతో తెలంగాణ సర్కారు మటన్ క్యాంటిన్ లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఈ పథకం తెలంగాణలో అమలుకానుంది. హైదరాబాద్ లోని మసబ్ ట్యాంక్ వద్ద తొలి మటన్ క్యాంటీన్ ప్రారంభం కానుంది.

ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ తరహా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. తెలంగాణలో మేకలు.. గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే గొర్రెల పెంపకందారుల మాంసం ఉత్పత్తిని మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మటన్ క్యాంటిన్లతో పాటు సంచార మాంస విక్రయశాలల ద్వారా ప్రజలకు ఆరోగ్యమైన ఆహారం అందించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News