ఆ ఫోన్ ఏదో బిల్డర్ కు చేసి ఉంటే పెద్ద రచ్చ తప్పేదిగా సారూ?

Update: 2020-12-20 17:30 GMT
అదేం సిత్రమో కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక పట్టాన అర్థం కాదు. ఓపక్క వంద రోజులకు పైనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన కారణంగా తెలంగాణ వ్యాప్తంగా సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. చడీ చప్పుడు చేయకుండా కొత్త సాఫ్ట్ వేర్ మీద కసరత్తు చేసిన సారు సర్కారు.. ఎక్కడో ఆంధ్రాలో ఉన్న ఆదర్శ రైతుకు మాత్రం ఫోన్ చేయటం ఏమిటో?

నిజానికి.. కేసీఆర్ ను కలవాలంటే మంత్రులకే సాధ్యం కాని పని. అంతలా బిజీగా ఉంటారు. ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో.. మరెప్పుడు ఫాంహౌస్ లో ఉంటారో కొందరికి మాత్రమే ఎరుక. నిత్యం ప్రయాణాలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి.. కాస్త టైం చిక్కితే వ్యవసాయం మీద ఆయన పెట్టే శ్రద్ధ అంతా ఇంతా కాదు. అదేమీ తప్పు కూడా కాదు. కాకుంటే.. అన్ని అంశాల మీద ఇలా కన్నేస్తే మరింత బాగుంటుంది.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను తెలంగాణలో నిలిపివేసిన వందరోజులకు పైనే ఆగిపోవటం.. ఆ తర్వాత జరిగిన పంచాయితీలు తర్వాత.. శనివారం సాయంత్రం పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపటం తెలిసిందే. ఇదే నిర్ణయాన్ని రెండున్నర నెల ముందే తీసుకొని ఉంటే.. లక్షల మందికి ప్రయోజనకరంగా ఉండేది. వ్యాపార వర్గాల అంచనా ప్రకారం.. తక్కువలో తక్కువ వేసుకుంటే.. రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షన్నర కోట్ల రూపాయిల టర్నోవర్ ఆగిపోయినట్లుగా చెబుతున్నారు. దీని మీద ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయమే భారీగా ఉండేది.

లక్షన్నర కోట్ల లెక్క ఎలా అంటారా? ఒక వ్యక్తి తనకున్న ఒక ఫ్లాట్ ను అమ్మాడనే అనుకుందాం. దాని ద్వారా రూ.50లక్షలు వస్తే.. దాన్ని మరో దాన్లో పెట్టుబడిగా పెడతాడు. అదే సమయంలో కనీసం రెండు..మూడు లక్షలైనా ఇతర అవసరాలకు వినియోగిస్తాడు. అదే సమయంలో.. పెట్టుబడి పెట్టిన కారణంగా వచ్చే నగదుతో మరో లావాదేవీ జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గొలుకట్టులో భారీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ఇలాంటి భారీ చైన్ ఎక్కడికక్కడ తెగిన పరిస్థితి. అవన్ని తిరిగి గొలుసులా మారాలంటే కొంతకాలం పడుతుంది.

రెగ్యులర్ గా జరిగిపోయే దాన్ని ఆపేసి.. ఏదో చేయాలనుకునే సీఎం.. ఒకరిద్దరు చిన్న బిల్డర్లకు ఫోన్లు చేసి.. మేం ఇలా అనుకుంటున్నాం భయ్.. ఏంది కత? అని అడిగి ఉంటే కష్టనష్టాలన్ని అప్పుడే చెప్పేవారు కదా? దాన్ని వదిలేసి.. ఇంతకాలం ఇంత నానపెట్టి సారు సాధించిందేమిటంట? పెద్ద రచ్చ.. ఆందోళన.. ప్రభుత్వం మీద వ్యతిరేకత. సాఫీగా సాగిపోయే దాన్ని.. సరికొత్తగా చేయాలనుకోవటం ఎందుకు? దానికి ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా సారూ?




Tags:    

Similar News