కేసీఆర్ కు అనిపిస్తే పేర్లు మారిపోతాయంతే..

Update: 2016-10-20 05:16 GMT
 తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలని అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు అనుకోవటం కొత్తేం కాదు. కానీ.. కీలక అంశాల విషయంలో తీసుకునే నిర్ణయాల్ని అన్ని వర్గాల సలహాల్ని.. సూచనల్ని పరిగణలోకి తీసుకుంటే ఊరికే మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదు. తాను అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోవాలన్నపట్టుదలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కొత్త జిల్లాలకు సంబంధించిన నిర్ణయాన్ని విపక్షాలతో చర్చించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పినా.. అఖిలపక్షం వేళ.. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల లెక్కకు.. ఆ తర్వాత మారిన లెక్కకు సంబంధం లేని పరిస్థితి. మరి.. కొత్త ముచ్చట గురించి అఖిలపక్షం నిర్ణయాల్ని పరిగణలోకి తీసుకున్నారా? అంటే లేదనే చెప్పాలి.

హడావుడి నిర్ణయాలతో పరిస్థితులు ఎలా ఉంటాయనటానికి తాజాగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల పేర్లే నిదర్శనంగా చెప్పొచ్చు. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. జిల్లాల విషయంలో అంతా ఓకే అయిపోయిందని.. ఇకపై మార్పులు.. చేర్పులకు అవకాశం లేదని తేల్చేసిన కేసీఆర్.. తాజాగా తన మాటను తానే మార్చుకున్న వైనం కనిపిస్తుంది.

యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేసిన జిల్లాకు తాజాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ పిలిచిన యాదాద్రి జిల్లా పేరును మారుస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఇకపై.. యాదాద్రిని యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలని డిసైడ్ చేశారు. టెంపుల్ సిటీగా యాదగిరి గుట్ట.. జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని చెప్పిన ఆయన.. ఇటీవల కాలంలో పలువురి నోటి నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకొనే యాదాద్రి పేరుకు చారిత్రక నేపథ్యం ఉన్న భువనగిరి పేరును జత చేస్తున్నట్లుగా చెప్పారు. ఓపక్క కొత్త జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు అన్నవే ఉండవని చెబుతున్న ముఖ్యమంత్రి.. జిల్లా పేర్లనే మార్చేస్తూ నిర్ణయం తీసుకోవటం విశేషం. అనుకోవాలే కానీ..  ముఖ్యమంత్రి  అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోకుండా అడ్డుకునే శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News