వరద సాయానికి.. అమిత్ షా భేటికి లింకేంటి?

Update: 2020-12-12 05:57 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లోని విలక్షణత చాలామంది ముఖ్యమంత్రుల్లో కనిపించదు. అనూహ్య నిర్ణయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ లా ఉంటారు. నిజానికి ఇదే తీరు.. తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైందని చెప్పాలి. సానుకూలత ఉన్నప్పుడు చెలరేగిపోవటం.. ప్రతికూలత ఎదురైనప్పుడు పక్కకు వెళ్లిపోవటంలో ఆయనకున్న నైపుణ్యం అంతాఇంతా కాదు. గ్రేటర్ ఎన్నికల్లోనూ.. అంతకు ముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ తెలంగాణను కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవటం లేదన్న విషయాన్ని హైలెట్ చేయటం తెలిసిందే.

అయినప్పటికీ కేసీఆర్ పాచిక పారలేదు. ఆయన మాటలకు ఓట్లు రాలలేదు. సహకరింని కేంద్రాన్ని సహకరించేలా చేయటం కోసం ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్.. నలబై నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వారి మధ్య ఏ అంశాల మీద చర్చ జరిగిందన్నది బయటకు రాలేదు.

కాకుంటే.. ఇటీవల హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వరదలతో భారీగా నష్టం వాటిల్లిందని.. రూ.5వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాల్సిందిగా ఆయన హోంమంత్రి అమిత్ షాను కోరినట్లుగా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాధారణంగా వరద సాయం కోసం.. ఆర్థిక సాయం కోసం ప్రధానమంత్రిని.. లేదంటే ఆర్థికమంత్రికి విన్నవిస్తారు. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం.. అమిత్ షాకు విన్నవించుకోవటం విశేషం.

ఎప్పటిలానే.. అమిత్ షా భేటీ అనంతరం.. వరద సాయంతో పాటు.. విభజన సమస్యలపైనా.. రాష్ట్ర ప్రాజెక్టుల మీదా.. రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. అమిత్ షా తో భేటీ తర్వాత.. ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశాలు మెరుగైనట్లుగా చెబుతున్నారు. ముందస్తు ప్లాన్ లేకుండా... అప్పటికప్పుడు ఢిల్లీ టూర్ పెట్టుకున్న కేసీఆర్.. వరద సాయం కోసం హోంమంత్రిని కోరటం మాత్రం.. మొత్తం పర్యటనలోనే హైలెట్ అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News