కేసీఆర్ వాడుతున్న హెలికాఫ్ట‌ర్ ఎవ‌రిది?

Update: 2018-10-05 04:28 GMT
అడుక్కుంటే.. మూడు నాలుగు సీట్లు ముష్టి వేస్తాం క‌దా?.. రూ.500 కోట్లు.. మూడు హెలికాఫ్ట‌ర్లు ఇస్తాన‌ని చెబితే చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకుంటారా?  మీ బ‌తుకులు చెడ‌.. ఇలా చెప్పుకుంటూ పోతే భారీగానే తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు కేసీఆర్‌. త‌న‌కు తిరుగులేద‌న్న భావ‌న‌లో ఉన్న‌ప్పుడు తియ్య‌గా.. క‌మ్మ క‌మ్మ‌గా మాట‌లు చెప్పే కేసీఆర్‌.. తానే మాత్రం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లు అనిపించినా.. త‌న అమ్ముల‌పొదిలో ఉండే ఎమోష‌న్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీస్తారు.

ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిట్టేస్తారు. అదేమంటే.. తాను తిట్టే తిట్లు అన్నీ ఆంధ్రా ప్రాంతా నాయ‌కుల‌ను ఉద్దేశించే త‌ప్పించి మ‌రింకేమీ లేదంటారు. ఒక‌వేళ అదే నిజ‌మ‌ని అనుకుందాం.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన చంద్ర‌బాబు వ‌ల్ల తెలంగాణ చెడిపోయింద‌నుకుందాం.. మ‌రి.. తెలంగాణ ఉద్య‌మం పీక్స్ లో ఉన్న వేళ 2009లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీతో టీఆర్ ఎస్ పొత్తు ఎందుకు పెట్టుకుంది?

అంతేనా.. ఏపీ బ‌డ్జెట్ భారీ పెరిగేలా చేయ‌టంలో చంద్ర‌బాబు కృషిని త‌క్కువ చేసి చూడ‌లేమంటూ భారీ ఎత్తున పొగ‌డ్త‌ల వ‌ర్షాన్ని అప్ప‌ట్లో కేసీఆర్ ఎందుకు కురిపించిన‌ట్లు? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత‌లు వాడుకునేందుకు వీలుగా మూడు హెలికాఫ్ట‌ర్ల‌ను ఇస్తాన‌ని బాబు మాట ఇచ్చార‌ని.. అందుకే సిగ్గు విడిచి టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ట్లుగా విరుచుకుప‌డుతున్నారు కేసీఆర్‌.

కేసీఆర్ మాట‌లే నిజ‌మ‌నుకుందాం. నీచ‌మైన చంద్ర‌బాబు విసిరే బిస్కెట్ల‌కు క‌క్కుర్తి ప‌డి.. ఆయ‌న పంపే హెలికాఫ్ట‌ర్ల కోసం నీచానికి దిగిన‌ట్లుగా కేసీఆర్ ఆరోప‌ణ‌ల్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. ఇప్పుడో ఆస‌క్తిక‌ర‌మైన అంశం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాల్లో నిర్వ‌హిస్తున్న స‌భ‌ల కోసం కేసీఆర్ వినియోగిస్తున్న ప్రైవేటు హెలికాఫ్ట‌ర్ ఎవ‌రిది?  దాని య‌జ‌మాని ఎవ‌రు?  అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

ఎన్నిక‌ల కోడ్ పాక్షికంగా అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో.. పార్టీ ప్ర‌చారానికి ప్ర‌భుత్వ హెలికాఫ్ట‌ర్‌ ను వినియోగించ‌టం సాధ్యం కాదు. దీంతో కేసీఆర్ ప్రైవేటు హెలికాఫ్ట‌ర్ ను వాడుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం కేసీఆర్ వాడుతున్న హెలికాఫ్ట‌ర్ ఎవ‌రిది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఆయ‌న త‌ర‌చూ విరుచుకుప‌డే సీమాంధ్రకు చెందిన ఒక ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ కు చెందిన‌ద‌న్న‌ మాట వినిపిస్తోంది.

మాట‌కు ముందు ఆంధ్రోళ్లు.. మాట త‌ర్వాత ఆంధ్రోళ్లంటూ అదే ప‌నిగా తిట్టేసే కేసీఆర్‌.. తాను ప్ర‌యాణించే హెలికాఫ్ట‌ర్ ను మాత్రం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ కు సంబంధించింది వాడేయ‌టంలో మ‌ర్మ‌మేంది? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ తెలంగాణ‌లోని ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌ను చేప‌ట్టిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. దీనిపై గులాబీ ద‌ళం ఏమ‌ని క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News