ఎంపీలకు కేసీఆర్ ఎందుకు ఫోన్ చేశారు?

Update: 2016-11-17 09:43 GMT
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోడీతో మరింత సానిహిత్యాన్ని పెంచుకోవటం.. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వీలైనంత భారీ మేలును ఆశిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రదాని మోడీ నిర్ణయంపై మనసులో ఆగ్రహం ఉన్నా.. అందుకు ఇది ఏ మాత్రం సరైన సమయం కాదన్న భావన ఆయనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. నోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని మోడీ మహా నేతగా అవతరించారని.. ఆయన ఇమేజ్ భారీగా పెరిగిపోయిందన్న వాదన ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయానికి కోట్లాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెబుతున్నారు.

ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీతో గొడవ కంటే కూడా.. తమకు ఎదురవుతున్న కష్టాల్ని విన్నవించటం.. పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీ చేసిన తప్పుల్ని తెలివిగా ఎత్తి చూపి.. వాటి పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటందన్న విషయాన్ని మోడీతోనే నేరుగా చెప్పాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతారు.

ఇందులోభాగంగా నోట్ల రద్దు ఎపిసోడ్ లో మోడీతో మరింత సన్నిహిత సంబంధాల్ని కేసీఆర్ కోరుకుంటున్నట్లుగా కొందరు చెబుతుంటారు. ఈ విషయంలో వాస్తవం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతానికైతే కేంద్రంతో ఘర్షణ వాతావరణాన్ని కేసీఆర్ కోరుకోవటం లేదన్నది స్పష్టమని చెప్పాలి. ఇందుకు తగ్గట్లే తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై విరుచుకుపడుతున్న విపక్షాలు.. ఆందోళన చేస్తున్నాయి. అయితే.. తమ ఎంపీలు ఎవరూ అలా చేయొద్దని.. పోడియం వద్దకు వెళ్లి మిగిలిన విపక్షాలతో కలిసి నిరసనలో పాలు పంచుకోవద్దని కేసీఆర్ ఫోన్ చేసిన వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రానికి సూచనలు చేయాలే తప్పించి.. నిరసనలు లాంటివి చేపట్టవద్దంటూ కేసీఆర్ సూచనలు చేయటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News