అటు కవితను.. ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్న కేసీఆర్

Update: 2022-11-16 06:46 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిన్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. “పాపం ఏంటంటే.. నా సొంత కూతురు కల్వకుంట్ల కవితను కూడా బీజేపీ నేతలు పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. ఆమెను బీజేపీలోకి ఫిరాయించాలని కోరుతూ సంకేతాలు పంపారు.

రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అస్థిరపరచబోతున్నాయో ఇది స్పష్టంగా తెలియజేస్తోందన్నారు.పార్టీ శాసనసభ్యులను తమ పార్టీలోకి లాక్కోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చిన టిఆర్ఎస్ చీఫ్, సిబిఐ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా కేసులు పెడతామని బెదిరించినా, కాషాయ పార్టీకి లొంగిపోవద్దని కోరారు.''ఇక నుంచి బీజేపీ తన కార్యాచరణను ముమ్మరం చేసి టీఆర్‌ఎస్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. బీజేపీపై యుద్ధం ప్రకటించాం కాబట్టి టీఆర్‌ఎస్ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీకి స్కోప్ ఇవ్వకండి' అని ఆయన అన్నారు.ఈడీ, సీబీఐ దాడులకు భయపడవద్దని కూడా ముఖ్యమంత్రి వారికి సూచించారు.

దీన్ని బట్టి కేసీఆర్ తన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సొంత కూతురు కవితను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్టు కూడా ఓపెన్ గానే కేసీఆర్ చెప్పారట.. ఎమ్మెల్యేల ఫోన్లను కూడా వింటున్నట్టు తెలిపి అందరికీ షాకిచ్చారు.

సీఎం కేసీఆర్ చేతులో తమ గుట్టు అంతా ఉండడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హడలి చస్తున్నారు. ఇలా ఫోన్లు వినడం చట్టప్రకారం అనైతికం.. నేరం అయినా కూడా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇదంతా చేస్తున్నారని అర్థమవుతోంది.

ఇక ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కాకుండా సిట్టింగ్ లందరికీ మళ్లీ సీట్లు ఇస్తానని.. ఎన్నికలకు మరో 10 నెలలు మాత్రమే ఉన్నందున అందరూ అలెర్ట్ ఉండాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. మూడో సారి గెలుపు కోసం కేసీఆర్ వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావని అర్థమవుతోంది.

ఇక ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండాలని.. వారి సమస్యలు తీర్చాలని.. వారికి నిధులు విడుదల చేస్తామని.. పార్టీ నేతలంతా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేసీఆర్ కోరారు. 100 ఓటర్లకు ఒక ఇన్ చార్జ్ ను నియమించాలని.. 5 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ధరణి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News