సీఎంను ర‌ప్పించిన ఘ‌న‌త ఆ గ్రామానిది

Update: 2015-08-17 12:37 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ జిల్లా గంగ‌దేవిప‌ల్లె లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఓ రాష్ర్ట సీఎం ను త‌మ ఊరికి ర‌ప్పించిన ఘ‌న‌త గంగ‌దేవిప‌ల్లె గ్రామ‌స్తుల‌కు ద‌క్కుతుంద‌న్నారు. గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ గ్రామానికి కేసీఆర్ రూ.10 కోట్లు కేటాయించ‌డంతో పాటు ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించారు.

 ఈ గ్రామంలో అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఉండ‌డం వ‌ల్లే గ్రామాభివృద్ధి జ‌రిగింద‌ని...ప్రజలంతా కమిటీలుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకుంటున్నారని కొనియాడారు. ఐక్య‌మ‌త్య‌మే మ‌హాబ‌లం అనే దానికి ఈ గ్రామం ఆద‌ర్శ‌మ‌న్నారు. భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లోని అన్ని ప‌ల్లెల‌ను దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతామ‌ని కేసీఆర్ చెప్పారు. అలాగే ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ‌జ్యోతి ప‌థ‌కంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

గంగ‌దేవిప‌ల్లె గురించి...

వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లంలోని ఓ గ్రామం గంగ‌దేవి ప‌ల్లె. 1994 సెప్టెంబ‌ర్‌ లో మ‌చ్చాపూర్ పంచాయ‌తీ నుంచి విడిపోయిన ఈ గ్రామం అతికాలంలో దేశంలోనే మంచి గుర్తింపుపొందింది. 1996, 2001లో జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఈ గ్రామం నుంచి స‌ర్పంచ్‌ తో పాటు వార్డు మెంబ‌ర్లంద‌రు మ‌హిళ‌లే ఎన్నిక‌వ్వ‌డం విశేషం. గ్రామ‌స్తులంద‌రి స‌మ‌ష్టి కృషితో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 2007లో ఈ గ్రామం నిర్మ‌ల్ జాతీయ పుర‌స్కారం పొంది..దేశంలోనే ఉత్త‌మ పంచాయితీగా ఎంపికైంది. దేశ‌ వ్యాప్తంగా ప‌లువురు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఈ గ్రామాన్ని సంద‌ర్శించ‌డంతో ఈ గ్రామం దేశ‌వ్యాప్తంగా హైలెట్ అయ్యింది.

 గ్రామంలో 100 % అక్ష‌రాస్య‌త‌, 100 % పారిశుధ్య నిర్మూల‌న‌, 100 % మ‌ధ్య‌పాన నిషేధం, గ్రామంలో 100 % కుటుంబ నియంత్ర‌ణ ఇవ‌న్ని ఆ గ్రామ ప్ర‌గ‌తి సూచిక‌లు. ఇప్ప‌ట‌కీ 20 లీట‌ర్ల నీటిని రూపాయికే ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు ఈ గ్రామాన్ని సంద‌ర్శించి వెళ్లారు. ప్ర‌స్తుతం ఇట్ల శాంతి స‌ర్పంచ్‌ గా ఉన్నారు.
Tags:    

Similar News