అదేంది కేసీఆర్‌.. ఇంత అప్పు చేసినావ్‌..!

Update: 2017-11-08 06:00 GMT
తెలంగాణ రాష్ట్రం వ‌స్తే బంగార‌మే. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల బ‌తుకులు మారిపోతాయ్ అంటూ కేసీఆర్ చెప్పిన మాట‌ల్లో నిజం సంగ‌తి ఎలా ఉన్నా.. అప్పులు మాత్రం భారీగా అయ్యాయి. అర‌వైఏళ్ల ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి విడిపోయిన వేళ తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన అప్పు కంటే.. మూడున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న‌లో చేసిన అప్పు భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం చాలా త‌క్కువ‌గా ఉంది.

నిత్యం ధ‌నిక రాష్ట్రం.. సంప‌న్న రాష్ట్రమ‌న్న కేసీఆర్ మాట‌ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. భారీగా పెరిగిన అప్పు భారం బెంబేలెత్త‌కుండా ఉండ‌ని ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు లెక్క‌ను ఎవ‌రో ఊహించో.. బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌లు కొట్టి బ‌య‌ట‌కు తీసిన లెక్క కాదు. ఇది అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ చెప్పిన లెక్క‌నే.

రాష్ట్రంపై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అప్పు రూ.1,35,554.03 కోట్లుగా అసెంబ్లీలో వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు అప్పు రూ.70వేల కోట్లు కాగా.. గ‌డిచిన మూడున్న‌రేళ్ల కేసీఆర్ హ‌యాంలో రాష్ట్రం చేసిన అప్పుడు దాదాపు రూ.65 వేల కోట్లుగా లెక్క చెప్పారు.

తాము తెచ్చిన రూ.65వేల కోట్ల అప్పులో రూ.40వేల కోట్లు మిష‌న్ భ‌గీర‌థ‌కు.. మ‌రో 20వేల కోట్లు కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఖ‌ర్చు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ఖ‌జానాపై ప‌డిన వ‌డ్డీ భారం రూ.8609.19 కోట్లుగా ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆర్థిక సంప‌ద‌ను పెంచేందుకు.. ఆర్థిక ప‌రిపుష్టిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అప్పులు చేసిన‌ట్లుగా చెప్పారు. ఎన్ని మాట‌లు చెప్పినా.. మూడున్న‌రేళ్ల‌లో పెరిగి అప్పు లెక్క అవాక్కు అయ్యేలా చేస్తుంద‌ని చెప్పాలి.

మిష‌న్ భ‌గీర‌థ కార‌ణంగా ప‌రిస్థితులు ఎంత మారాయ‌న్న‌ది తెలిసిందే. చూస్తే.. పెట్టిన ఖ‌ర్చుతో పోలిస్తే.. ప్ర‌యోజ‌నం చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపించ‌క మాన‌దు. మూడున్న‌రేళ్ల‌కు ఇంత భారీ అప్పు అయితే.. రానున్న రోజుల్లో క‌ట్టాల్సిన తెలంగాణ అసెంబ్లీ.. స‌చివాల‌యం.. మ‌రెన్నో కార్య‌క్ర‌మాల‌కు ఇంకెన్ని వేల కోట్లు అప్పు అవుతాయో? అప్పు చేసి ప‌ప్పు కూడా అవ‌స‌ర‌మంటారా కేసీఆర్‌జీ?
Tags:    

Similar News