ప్రగతిభవన్ లో కేసీఆర్ సుదీర్ఘ భేటీ.. ఎవరితోనంటే?

Update: 2020-07-12 09:10 GMT
దగ్గర దగ్గర రెండు వారాల తర్వాత ఫాంహౌస్ నుంచి ప్రగతిభవన్ కు వచ్చేశారు తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్. ఫాంహౌస్ లోరోజుల తరబడి ఉండటం గులాబీ బాస్ కు కొత్తేం కాకున్నా.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో.. అన్నేసి రోజులు ఫాంహౌస్ లో ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయితే.. ఇలాంటి వాటిని కేసీఆర్ అస్సలు పట్టించుకోకపోవటమే కాదు పిచ్చ లైట్ తీసుకుంటారన్నది మర్చిపోకూడదు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న కాలంలోనే హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున కేసులు నమోదైన పరిస్థితి. దీంతో.. పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం కావటమే కాదు.. ఏదో ఒకరకంగా సిటీలో కేసుల సంఖ్య తగ్గేలా చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది.

ఇలాంటివేళలో ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చినంతనే.. ఏ అంశాలపై రివ్యూ జరుపుతారు? అన్న ప్రశ్నకు కరోనా అన్న సమాధానం వస్తుంది. అలా చేస్తే ఆయన కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి? అందరు కోరుకున్నదేదీ చేయటానికి ఇష్టపడని కేసీఆర్.. ఊహకు అందని రీతిలో పావులు కదపటం ఆయనకు అలవాటే. అందుకు తగ్గట్లే తాజాగా కూడా ఆయన అలాంటి పనే చేశారు.

శనివారం ఉదయం ప్రగతిభవన్ కు చేరుకున్న ఆయన.. దసరా నాటికి రాష్ట్రంలో రైతు వేదికల్ని పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ఎప్పటిలానే గంటల కొద్దీ సమయాన్ని వారితో కూర్చున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏమేం చేయాలన్న విషయాలపై తన విజన్ ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించినట్లు చెబుతున్నారు.

రైతులకు రైతుబంధు అందిందా? లేదా? అన్న విషయాన్ని అధికారుల్ని అదే పనిగా అడిగిన ఆయన.. 99.9 శాతం మందికి అందిందన్న అధికారుల మాటతో సమాధానపడినట్లు చెబుతున్నారు. మిగిలిన వారికి కూడా వెంటనే సాయం అందేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రైతుబంధు అందలేదన్న మాట చెప్పకూడదని తేల్చిన ఆయన.. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా ప్రభుత్వం మాత్రం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతుబంధు డబ్బులు రైతులకు అందించే విషయాన్ని అత్యధిక ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

రైతులు పండించిన పంటకు మంచి ధర రావటమే లక్ష్యంగా నియంత్రిత సాగు విధానం మంచిదన్న మాట చెప్పిన కేసీఆర్.. తాము చెప్పినట్లేరైతులు మక్కల సాగు వద్దంటే వారు వేయలేదన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతుల్లో గొప్ప పరివర్తన వచ్చిందని..నియంత్రిత సాగు విధానం నూటికి నూరుపాళ్లు సక్సెస్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలకు మంచి ధర వచ్చేలా చేస్తామన్నారు. దసరా నాటికి ప్రభుత్వం అనుకున్నట్లుగా ఆయా గ్రామాల్లో రైతు వేదికకల్ని పూర్తి చేయాలన్న టార్గెట్ ను ఇచ్చేశారు. ఏమైనా ఇలాంటివి సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.


Tags:    

Similar News