బెండు తీసే కేసీఆర్‌.. ఎంత‌లా వంగుతారంటే?

Update: 2018-12-27 10:47 GMT
ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో తెలిసినోడు గొప్పొడు. ఈ డైలాగ్ బాగా అరిగిపోయేందే అయినా.. దాన్ని మ‌న‌సులో అట్టి పెట్టుకొని స‌మ‌యానికి త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించటం అంత తేలికైన విష‌యం కాదు. ఊహించ‌ని విజయాన్ని సొంతం చేసుకున్న వేళ‌.. అణుకువ‌గా మాట్లాడుతూనే.. ఛాన్స్ చిక్కినంత‌నే చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయంగా ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది.

మాంచి టైమింగ్ లో కేసీఆర్ వాడిన రిట‌ర్న్ గిఫ్ట్ మాట ఇప్పుడు ప‌లువురి నోట అదే ప‌నిగా వాడేస్తున్న ప‌రిస్థితి. త‌న ప్ర‌త్య‌ర్థుల్ని క‌ల‌లో కూడా విడిచి పెట్టే అల‌వాటు లేని కేసీఆర్‌కు.. ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో బాగా తెలుసు. అందుకు నిద‌ర్శ‌నంగా ఈ రోజు దిన‌ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వ‌చ్చిన ఫోటోల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

పలు మీడియా సంస్థ‌లు.. అక్క‌డ ప‌ని చేసే ఎడిటోరియ‌ల్ సిబ్బంది అభిరుచికి త‌గ్గ‌ట్లు.. వారికున్న అప్ర‌క‌టిత గైడ్ లైన్స్ కు త‌గ్గ‌ట్లుగా మోడీ.. కేసీఆర్ భేటీకి సంబంధించిన ఫోటోను ప్ర‌ముఖంగా పబ్లిష్ చేశారు. కాకుంటే.. కొన్ని ప‌త్రిక‌ల్లో మోడీ ముందు కేసీఆర్ బాగా వంగిన‌ట్లుగా క‌నిపిస్తే.. మ‌రికొన్ని ప‌త్రిక‌ల్లో మాత్రం విన‌యాన్ని అవ‌స‌రానికి మించి ఒల‌క‌బోసేలా  కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌న్న భావ‌న క‌లిగే ఫోటోల్ని అచ్చేశారు.

కేసీఆర్‌ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరున్న మీడియాలో మాత్రం మోడీ.. కేసీఆర్ ల‌కు ఏ మాత్రం డ్యామేజ్ క‌ల‌గ‌ని రీతిలో ఫోటోల్ని ప్రింట్ చేసిన తీరు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చూస్తే.. మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య స‌మావేశం ఎంత సానుకూల వాతావ‌ర‌ణంలో జ‌రిగింద‌న్న విష‌యంతో పాటు.. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం ఎంత బ‌ల‌మైన‌ద‌న్న విష‌యాన్ని చెప్పేలా ఫోటోలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ ఇద్ద‌రు గ‌త నెల‌లో ఇదే స‌మ‌యానికి ఒక‌రిపై ఒక‌రు ఎంత‌లా విమ‌ర్శ‌లు చేసుకున్నారో తెలియంది కాదు. ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మోడీని క‌డిగిపారేసేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని కేసీఆర్‌.. ఫ‌లితాలు వెల్ల‌డైన రెండు వారాల్లోనే మోడీ ముందుకు వెళ్లి ఆయ‌న ముందు ప‌లు డిమాండ్ల‌ను పెట్ట‌టం.. వాటిల్లో చాలావ‌ర‌కూ సానుకూలంగా స్పందించిన తీరు చూస్తే.. కేసీఆర్ మామూలోడు కాద‌న్నది అర్థం కాక మాన‌దు.

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఎప్పుడేం చేయాలో త‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీద‌న్న విష‌యాన్ని మోడీతో భేటీతో సంద‌ర్భంగా కేసీఆర్ వ్య‌వ‌హారశైలిని చూస్తే ఇట్టే అర్థం కావ‌టం ఖాయం. ఎన్నిక‌ల వేళ త‌న పాల‌న‌పై మోడీ చేసిన విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టే క్ర‌మంలో ఘాటు వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మాత్రం అందుకు భిన్నంగా వైరాన్ని వ‌దిలేసి.. మోడీతో భేటీ కావ‌టం.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు విన‌తులు ఆయ‌న ముందు పెట్టిన తీరు చూస్తే.. ఆయ‌న వ్యూహం ఎంత ప‌క్కాగా ఉంటుందో ఇట్టే తెలుస్తుంది. అంతేకాదు.. తేడా వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల బెండు తీసే కేసీఆర్‌.. అదే స‌మ‌యంలో తాను అనుకుంటే నిప్పులు చెరిగిన వారి ముందు తానెంత వంగిపోతాన‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో కేసీఆర్ చేసి చూపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ప్ర‌పంచంలో ఏదీ శాశ్వితం కాదు. ఏ సిద్ధాంతమైనా.. కాలానికి అనుగుణంగా మారుతుంద‌న్న దానికి నిలువెత్తు రూపంగా కేసీఆర్‌ను చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News