ఛ‌త్.. చింత‌మ‌డ‌క‌లో ఎందుకు పుట్ట‌లేదు!

Update: 2019-07-23 14:30 GMT
దేశంలో చాలానే రాష్ట్రాలు ఉన్నాయి. చాలామంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వారంద‌రికి పుట్టిన ఊళ్లు ఉన్నాయి. కానీ.. ఎవ‌రూ చేయ‌న‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఐదేళ్ల త‌ర్వాత తొలిసారి ముఖ్య‌మంత్రి హోదాలో ఒంట‌రిగా తాను పుట్టిన ఊరు చింత‌మ‌డ‌క‌కు వెళ్లిన కేసీఆర్‌.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు బోలెడ‌న్ని వ‌రాలు ఇచ్చేశారు. వాటిని చూసిన త‌ర్వాత తెలంగాణ‌లోని ప్ర‌తి ఒక్క‌రూ.. తాము ఎందుకు చింత‌మ‌డ‌క‌లో పుట్ట‌లేద‌న్న వేద‌న‌తో ఏడ్చేలా చేశారు కేసీఆర్‌.

దేవుడా.. మేమేం త‌ప్పు చేశామ‌ని చింత‌మ‌డ‌క‌లో పుట్టించ‌కుండా ఇంత పెద్ద శిక్ష విధిస్తావ్‌? అన్న వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్నోళ్లు బోలెడంత‌మంది క‌నిపిస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే స‌మ‌యంలో తాను చేసిన ప్ర‌మాణానికి పూర్తి విరుద్ధంగా కేసీఆర్ తాజాగా నిర్ణ‌యాలు ఉన్నాయ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

పుట్టిన గ్రామానికి అంతో ఇంతో చేసుకోవ‌టం మామూలే. నిజానికి అది కూడా త‌ప్పే అవుతుంది. నైతికంగా చూసిన‌ప్పుడు త‌న‌ను రాష్ట్రం మొత్తం బాగు చేయాల‌ని కోరిన‌ప్పుడు.. ముందు తాను పుట్టిన ఊరిని.. తాను నివాసం ఉండే బ‌జారును బాగు చేసుకున్నాక‌.. రాష్ట్రం మొత్తం బాగు చేస్తాన‌ని భావించ‌టం ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి చేయ‌టం స‌బ‌బేనా?

చింత‌మ‌డ‌క‌కు వెళ్లిన కేసీఆర్‌.. ఆ గ్రామంలో ఉన్న 2వేల కుటుంబాల‌కు (కొత్త‌గా పెళ్ల‌యిన వారిని కూడా వేరే కుటుంబంగా లెక్కించాల‌ని ఫ‌ర్మానా జారీ చేశారు) డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌తో పాటు.. ప్ర‌తి ఇంటికి రూ.10ల‌క్ష‌ల చొప్పున విలువైన ఆస్తులు అందిస్తామ‌ని.. త‌మ‌కు నచ్చిన ప‌ని చేసుకోవాల‌న్నారు.

టాక్ట‌రు.. వ్య‌వ‌సాయ ప‌ని ముట్లు అడిగితే.. వాటిని.. కారు ఇస్తే డ్రైవింగ్ చేసుకుంటూ బ‌తుకుతా అంటే.. దాన్ని.. ఇలా ఎవ‌రికి తోచింది వారు.. ఎవ‌రికి న‌చ్చిన ప‌ని వారు చేసుకునేందుకు అవ‌స‌ర‌మైన  ఆర్థిక సాయం రూ.10ల‌క్ష‌లు ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని.. దాంతో వారు ఆర్థికాభివృద్ధి సాగించొచ్చ‌ని లెక్క చెప్పారు. ఇందుకోసం రూ.200 కోట్ల‌ను కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసేసుకున్నారు.

ఓప‌క్క స‌రైన వైద్య స‌దుపాయం లేక ఏటా వేల‌ల్లో అమాయ‌క‌ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. రోడ్ల మీద గుంత‌లు.. స‌రైన డిజైన్లు లేక‌పోవ‌టం కార‌ణంగా వంద‌ల్లో మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. అంతెందుకు కోటిన్న‌ర వ‌ర‌కూ ఉన్న గ్రేటర్ హైద‌రాబాద్ లో వ‌ర్షం వ‌స్తే న‌ర‌కం అంటే ఏమిటో క‌నిపించే ప‌రిస్థితి. న‌ల్లా నీళ్లు లేని దుస్థితి. ట్రాఫిక్ కార‌ణంగా కొన్ని కోట్ల ప‌ని గంట‌లు నిత్యం వృధా అవుతున్న దారుణ ప‌రిస్థితి. ఇలాంటి వాటిని స‌రి చేయాల్సిన కేసీఆర్‌.. వాటిని వ‌దిలేసి.. తాను పుట్టిన ఊళ్లోని ప్ర‌తి కుటుంబానికి రూ.10ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందించ‌టం దేనికి నిద‌ర్శ‌నం.

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా అంద‌రికి తోడ్పాటును అందించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాలి. లేని ప‌క్షంలో ఆ ప్ర‌య‌త్నం చేయాలి. ఒక‌వేళ‌.. సొంతూరు మీద అంత మోజే ఉంటే.. త‌న సొంత ఆస్తి నుంచి గ్రామ ప్ర‌జ‌ల‌కు పంచాలి. అది క‌ష్టం అనుకుంటే.. త‌న కుటుంబానికి ఉన్న వ్యాపారాల్ని త‌న‌ఖా పెట్టి.. వ‌చ్చిన సొమ్మును సొంతూరు ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టి.. వారి చేత వ్యాపారం చేయించి.. తిరిగి చెల్లించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాలి. ఎవ‌రికి వారు.. తాము ఏ ఊళ్లో పుట్టాలో.. ఎవ‌రి క‌డుపులో జ‌న్మించాలో నిర్ణ‌యించుకునే అవ‌కాశం కేసీఆర్ బాగా న‌మ్మే దేవుడు ఇవ్వ‌లేదు. అలాంట‌ప్పుడు సీఎం పుట్టిన ఊళ్లో పుట్ట‌ట‌మే అదృష్ట‌మ‌న్న‌ట్లుగా ఉండ‌కూడ‌దు. అదే జ‌రిగితే.. నిజంగా క‌ష్ట‌ప‌డేటోళ్ల ప‌రిస్థితి ఏమిటి?  సీఎంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శవంతంగా ఉండేలా పాల‌న అందించాలే కానీ.. దేవుడా.. సీఎం పుట్టిన ఊళ్లో న‌న్ను పుట్టించ‌కుండా ఇంత పెద్ద శిక్ష విధించావేమిటన్న వేద‌న ప‌డ‌టం దేనికి నిద‌ర్శ‌నం సారూ?
Tags:    

Similar News