ఎవరేం అనుకున్నా కేసీఆర్ అంతేనా?

Update: 2017-01-16 06:38 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చాలా భిన్నమన్న విషయం తెలిసిందే. కొంతమంది విషయంలో ఎంత చనువుగా ఉంటారో.. కొంతమంది దగ్గర అంతే దూరంగా ఉంటారు. ప్రముఖులు అన్నాక కొన్నిసార్లు తప్పని పరిస్థితులు ఉంటాయి. కానీ.. అలాంటివేమీ తనకు పట్టవన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తుంటారు. కొన్నిసార్లు ఆయన వ్యవహరించే తీరు విచిత్రంగా.. షాకింగ్ గా ఉంటుంది.

ప్రముఖులు.. వారి కుటుంబ సభ్యులు మరణించినప్పుడు.. ఏ మాత్రం పరిచయం ఉన్నా పరామర్శకు వెళ్లి వస్తుంటారు. కానీ.. అలాంటి వాటి విషయంలో కేసీఆర్ తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ప్రముఖులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ.. ఎవరైనా మరణిస్తే.. ప్రముఖులు తప్పనిసరిగా వారి ఇళ్లకు వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేస్తారు. శోకంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుంటారు. కానీ.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి అలాంటివి చేయరన్న విమర్శ ఉంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవిని చేపట్టిన తర్వాత పలువురు ప్రముఖులు.. వారి కుటుంబ సభ్యులు మరణించినప్పటికి చాలా సందర్భాల్లో వెళ్లకుండా ఉండిపోవటం కనిపిస్తుంది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాతృమూర్తి సరోజినీ మరణించారు. ఆమెను పరామర్శించేందుకు గవర్నర్ నరసింహన్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. సుప్రీం.. హైకోర్టు న్యాయమూర్తులు.. పలువురు ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. తన వరకూ తాను ఒక సంతాప సందేశాన్ని పంపి ఊరుకున్నారే కానీ.. ఎన్వీ రమణ ఇంటికి వెళ్లకపోవటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తల్లి చనిపోతే.. పరామర్శకు రాకపోవటమా అన్నది ఒక ప్రశ్న అయితే.. మిగిలిన ప్రముఖుల మాదిరి కాకుండా జస్టిస్ ఎన్వీ రమణ ఇల్లు.. కేసీఆర్ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఆయన వెళ్లకపోవటం గమనార్హం. ఇలా.. తనదైన శైలిలో వ్యవహరించే కేసీఆర్ ఎప్పుడు.. ఎలా వ్యవహరిస్తారో ఒకపట్టాన అర్థం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News