మాస్కు పెట్టుకోని కేసీఆర్.. శానిటైజర్ మాత్రం పక్కనే పెట్టుకున్నారే

Update: 2020-09-25 06:30 GMT
కరోనా కారణంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ మాస్కు పెట్టుకోవాలన్న రూల్ ను తెచ్చేశారు పాలకులు. ఎంత కరోనా అయితే మాత్రం.. ముఖానికి మాస్కు పెట్టుకునేదే లేదంటూ అమెరికన్లు కొందరు తెగేసి చెప్పే ధోరణి కనిపిస్తుంటుంది. వారు తప్పించి.. ప్రపంచంలోని అన్ని దేశాల వారు బుద్ధిగా మాస్కు పెట్టేసుకొని మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మాత్రం మాస్కు పెట్టుకోవటానికి అస్సలు ఇష్టపడరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు మెడలో వేసుకునే కండువాతో అప్పుడప్పుడు కవర్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తారు. ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి ఆయన పూర్తి వ్యతిరేకమన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.

కార్యక్రమం ఏదైనా.. ముఖానికి మాస్కు మాత్రం ఉండని తీరు జగన్ లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. గురువారం ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఒక సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. భూముల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని వెల్లడించటమే ఈ సమావేశ లక్ష్యం.

ఎప్పటిలానే.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖానికి మాస్కు పెట్టుకోకుండా వచ్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ముఖానికి మాస్కు లేని ఆయన.. టేబుల్ మీద పెద్ద శానిటైజర్ డబ్బాను ఉంచటం గమనార్హం. మాస్కు అవసరం లేని పెద్ద మనిషికి.. శానిటైజర్ అవసరం ఉంటుందా? అన్న మాట కొందరి నోట వినిపించటం విశేషం. అయితే.. ఈ మాటలన్ని గుసగుసలానే ఉండటం గమనార్హం.
Tags:    

Similar News