పాలకులు మారినప్పుడల్లా విధానాలు మారుతుంటాయి. విధానాలు మారినప్పుడల్లా కొన్ని చిక్కులు వస్తుంటాయి. అయితే ఆ విధానాల్లో మంచివి కూడా ఉండవచ్చు. తాజాగా తెలంగాణ రాష్ర్టంలో ఇదే జరుగుతోందనే చర్చ ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
సర్కారుకు ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారట. ప్రధాన శాఖలైన కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్స్ పై కేసీఆర్ కన్నేశారట. ఈ విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గమనించిన తెలంగాణ సీఎం వీటిపై నిఘా పెట్టారట. ప్రభుత్వంలో ఉండే ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సైతం ఈ నిఘా కొనసాగుతోందట. మూడంచెల నిఘా వ్యవస్థ ద్వారా అవినీతిని పసిగట్టేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతికి పాల్పడుతున్నారని భావిస్తున్న వారి ఫోన్ నంబర్లు సేకరించి వాటిని ట్యాప్ చేస్తున్నారట. తద్వారా ఏవిధంగా అవినీతి జరుగుతోంది, తద్వారా ప్రభుత్వానికి కలుగుతున్న ఆదాయ, ఇతర నష్టం ఏంటి అనేది ఆరా తీసే పనిలో పడ్డారట.
ఈ పరిస్థితులకు బలం చేకూర్చే సంఘటనలు సైతం జరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ర్టంలో ఏసీబీ దాడుల జోరు పెరిగింది. దాదాపు పెద్ద చేపలే ఏసీబీ వలలో చిక్కుతున్నాయి. హైదరాబాద్ మొదలుకొని ఆదిలాబాద్ వరకు అక్రమార్కులు చిక్కుతూనే ఉన్నారు. అందులోనూ ఈ ప్రధాన డిపార్ట్‌మెంట్ల వారే ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి చర్య వెనక అనేక మంచి ఉద్దేశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.