కేసీఆర్ పాలమూరులో ఈమాట చెప్పగలరా?

Update: 2017-10-23 15:53 GMT
గులాబీ బాస్ కేసీఆర్ వరంగల్ లో జౌళి పార్కును ప్రారంభించారు. మొత్తానికి సుదీర్ఘకాలపు కలను ఆయన సాకారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ జౌళి పార్కు ఏర్పాటు అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న కాలంలోనే తన మదిలో మెదిలిన ఆలోచన అని, ఇది కార్యరూపం దాల్చేసరికి వలసలు వెళ్లిన నేత కార్మికులంతా తిరిగి వచ్చే పరిస్థితి వస్తుందని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలు కడుపు చేతిలో పట్టుకుని కూలి పనుల కోసం వలసలు వెళ్లే పరిస్థితికి తెరదించడాన్ని మించిన సుపరిపాలన ఉండదు. అయితే ముఖ్యమంత్రి గమనించాల్సింది మరో సంగతి కూడా ఉంది. ఇదే మాటను ఆయన పాలమూరు జిల్లాలో కూడా చెప్పే రోజు రావాలి. పాలమూరు కన్నీళ్లను కూడా తుడవడానికి ప్రభుత్వం నిర్దిష్టంగా పనిచేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం ప్రకారం అయితే.. అనంతపురం - మహబూబ్ నగర్ జిల్లాలు వలసలకు ప్రసిద్ధి. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత.. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల జీవితాల్లో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వం వారికి మాటలు చెబుతున్నదే తప్ప సంక్షేమం అనేది వారి కళ్లెదుటకు రాలేదు. ఈనేపథ్యంలో ఆ జిల్లా పరిధినుంచి ఇప్పటికీ వలసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వలసలు వెళితే తప్ప.. పొట్టకూటికి గడవని పరిస్థితి ఏర్పడుతోంది. పాలమూరు జిల్లాలో చిన్న ఉపాధులను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం సమీకృత అభివృద్ధి మీద దృష్టి  సారించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

గణాంకాల పరంగా వలసలు అత్యధికంగా ఉండే పాలమూరు జిల్లాలో పారిశ్రామిక పురోగతిని సాధించి, స్థానికులకు కూలిపనులైనా దొరికే మార్గం చూపించి.. ఇక ఈ జిల్లానుంచి ఒక్కరు కూడా వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేశానని చెప్పగలిగిన రోజున కేసీఆర్ పాలన బాగున్నట్లు అవుతుందని... అలా నిర్దిష్టమైన పనులు చేపట్టకుండా.. ఏదో వరంగల్ లో ఓ జౌళి పార్కు ఏర్పాటుచేసి.. అక్కడి వలసలకు మాత్రం ఉపశమనం కల్పిస్తే సరిపోదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాలమూరు జిల్లాలో గులాబీ పార్టీ కంటె ప్రత్యర్థి పార్టీలే కాస్త బలంగా ఉన్నందునే ప్రభుత్వం ఆ జిల్లాను చిన్న చూపు చూస్తున్నదని, సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నదని కూడా విమర్శలు ఉన్నాయి. ఇలాంటి విమర్శలు నిజం కాదని నిరూపించుకోవాలంటే కేసీఆర్.. ఆ జిల్లానుంచి కూడా ఒక్కరూ వలసలు వెళ్లాల్సిన అవసరం లేని రోజును తీసుకురావాలి.
Tags:    

Similar News