కేసీఆర్ నాటిన మొక్క మళ్లీ ఎండింది

Update: 2016-07-19 18:01 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం స్వ‌ల్ప‌కాలంలోనే చేదు అనుభ‌వాల‌ను ఇస్తోంది. హ‌రిత‌హారంలో భాగంగా నాటిన మొక్కలు పది రోజుల తిరగకముందే ఎండిపోతుండడం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యాలకు అవరోధంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వ‌యంగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద మొక్క నాటి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట హరితహారాన్ని ప్రారంభించిన మొక్క‌లు వాడిపోయాయి.

కేసీఆర్ మొక్క‌లు నాటుతున్న స‌మ‌యంలోనే న‌ల్ల‌గొండ జిల్లా పరిధిలోని తూప్రాన్‌పేట నుండి కోదాడ మండలం నల్లబండ వరకు 153 కిలోమీటర్ల మేరకు రికార్డు స్థాయిలో ఒకేరోజు 87 వేల మొక్కలు నాటారు. ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది - మహిళా సంఘాలు - అంగన్‌ వాడీలు - స్వచ్ఛంద సంస్థల సభ్యులంతా పోటీలు పడి మరీ మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కులేక, అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల‌ ప్లాస్టిక్ కవర్‌తోటే మొక్కను గుంతలో వేసి అరకొరగా పూడ్చడం, నేల ప్రతికూల స్వభావం, వర్షాలు పడకపోవడం, ఊష్ణోగ్రతలు తగ్గకపోవడం వంటి కారణాలతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోతూ దర్శనమిస్తున్నాయి. ఇలా హైదరాబాద్ విజయవాడ-జాతీయ రహదారి వెంట ఎక్కడ చూసినా ఎండిన మొక్కలు, కవర్లతో సగం మట్టి కప్పిన మొక్కలు, వేర్లు తేలి ఎండిన మొక్కలే వేలాదిగా దర్శనమిస్తున్న తీరు హరితహారం అమలులో ప్రణాళిక లేమికి దర్పణం పడుతోంది.

మొక్కలు నాటినప్పటికీ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలను అటు నాటిన వారుగానీ, ఇటు నాటించిన ప్రభుత్వం- అధికారులు కానీ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోకపోవడంతో ‘దిక్కులేని అనాథ‌లుగా మారిన జాతీయ రహదారి రికార్డు మొక్కలు’ అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. జాతీయ ర‌హ‌దారిలో ప‌లుచోట్ల రహదారి వెంట ఎండిన మొక్కలు ఆ దారిలో వెళ్లే వారికి కనిపిస్తున్నాయి. ఇలాగైతే జాతీయ రహదారికి హరితహారం సొగసుల సంగతేమోగాని నర్సరీల్లో మొక్కలు పెంచి, నాటేందుకు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయిన‌ట్లేనంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. హరితహారం ప్రారంభం రోజున అధికారులు మాట్లాడుతూ జాతీయ రహదారి వెంట హరితహారం మొక్కల సంరక్షణకు పర్యవేక్షణాధికారులను నియమిస్తామని, రోడ్డు వెంట వారి సెల్‌ఫోన్ నెంబర్లు రాయిస్తామన్నారు. ఈ దిశగా నేటికీ చర్యలు తీసుకోకపోగా వర్షాలు లేక నాటిన మొక్కలు ఇప్పటికే వేలల్లో చనిపోయాయి. హెచ్‌ ఎండిఏ - ఫైరింజన్ సిబ్బంది జాతీయ రహదారి వెంట లక్కారం-మల్కాపురం ప్రాంతంలో ఎండిన మొక్కలకే నీళ్లు పోస్తున్నారు. అవి ఇప్పటికే చనిపోయి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వ‌రుస‌గా రోడ్డు వెంట బతికివున్న మొక్కకు, చనిపోయిన మొక్కలకు కూడా నీళ్లు పోస్తుండ‌ట క‌నిపిస్తోంది. మొత్తంగా హ‌రిత‌హారం అంటే ఎండిన మొక్క‌ల స‌మాహారం అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది.
Tags:    

Similar News